Molestation On Meerpet Girl In Hyderabad:
హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని మీర్‌పేటలో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ కి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఇండిపెండెన్స్ డే రోజు ఓ మహిళను ఎల్బీనగర్ పీఎస్ కు తరలించి ఆమెపై దాడిచేసిన ఘటనపై సైతం గవర్నర్ నివేదిక కోరడం తెలిసిందే.
నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి ఏడు బృందాలు..
మీర్ పేట్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో విచారణ కొనసాగుతుందని ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ తెలిపారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ముగ్గురు అత్యాచారం చేసినట్లు గుర్తించామన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. బాలికపై ఈ దారుణానికి పాల్పడింది స్థానికులేనని, వారి గురించి తెలిసిన వారేనని స్పష్టం చేశారు. బాలికకు వైద్య చికిత్సలు పూర్తి చేశామని, మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు.
ఈ కేసులో ఇదివరకే కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో అబేద్ లాల్ రౌడీ షీటర్ పై అనుమానం ఉందన్నారు. బాలిక ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ముగ్గురు ఈ దారుణానికి పాల్పడ్డారు. నందనవనం పరిసర ప్రాంతాల్లో గంజాయి వినియోగంపై దృష్టిపెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా గంజాయి అరికట్టడంలో రాచకొండ పోలీస్ ముందుంటారన్నారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వారు కూడా గంజాయి బ్యాచ్ అని అనుమానిస్తున్నట్లు డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
మైనర్ బాలిక తండ్రి రెండో వివాహం చేసుకోవడంతో వీరి తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాలిక సోదరులతో కలిసి నగరంలోని మీర్ పేట నందనవనంలో నివాసం ఉంటోంది. తండ్రి వీరికి దూరంగా ఉన్నాడని స్థానికంగా ఉండే కొందరు బాలికపై కన్నేశారు. నిందితులు సోమవారం పట్టపగలే వీరి ఇంట్లోకి చొరబడ్డారు. ఆపై కత్తులతో బాలికను, ఆమె సోదరుడిని బెదిరించారు. అనంతరం ముగ్గురు నిందితులు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. సోదరుడి ఎదుటే నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తనకు జరిగిన అన్యాయంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వైద్య పరీక్షలకు పంపించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉందని, నిందితులను పట్టుకునేందుకు కొన్ని బృందాలు రంగంలోకి దిగాయని డీసీపీ సాయిశ్రీ తెలిపారు.
Also Read: Hyderabad News: రాత్రంతా మహిళపై పీఎస్‌లో థర్డ్ డిగ్రీ - ఎల్బీ నగర్ పోలీసులపై కేసు నమోదు
ప్రతిపక్షాల ఆందోళన..
బీఆర్ఎస్, కేసీఆర్ పాలనలో సామాన్యులకు రక్షణ లేకుండా పోతోందని, మొన్న ఎల్బీనగర్ లో స్వాతంత్య్ర దినోత్సవం రోజే దళిత మహిళను బలవంతంగా పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లారని ఆరోపించారు. పీఎస్ లో మహిళను చిత్రహింసలు పెట్టారని, పోలీసులే సామాన్యులపై దాడులు చేస్తున్నారన్న ధైర్యంతో నిందితులు పట్టపగలే బాలిక ఇంట్లోకి చొరబడి సామూహిక అత్యాచారం చేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బాలికపై జరిగిన దారుణాన్ని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో ఎల్బీనగర్, మీర్ పేట పరిధిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొందరు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.