Tamilisai gives Counter to KTR Comments: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమైన బిల్లుల విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. గవర్నర్ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాను కొన్ని బిల్లులను ఆమోదించానని, అసలు బిల్లులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కారణం వివరించారు.
తాను తెలంగాణలో ఎవరికీ వ్యతిరేకం కాదని, అసలు బిల్లులను తిరస్కరించి, వెనక్కి పంపాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు గవర్నర్. కావాలనే కొందరు తనమీద ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదని తమిళిసై అన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, బాధలను చూసి చలించిపోయానని చెప్పారు. అతి త్వరలోనే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్ తెలిపారు. ఇప్పటికీ ప్రజలు పడుతున్న బాధలు తన కళ్ల ముందు కదలాడుతున్నాయని ఆమె వివరించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.
రాష్ట్రంలో వరద ప్రభావంతో జరిగిన నష్టంపై ప్రభుత్వం నుంచి రిపోర్ట్ అడిగానని, అది రాగానే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని తమిళిసై స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. వర్షాలపై కొన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చాయని.. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. దీంతో పాటు బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పానని గవర్నర్ తమిళిసై తెలిపారు.
మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో పునరావస చర్యలపై వేగంగా జరగట్లేదని కాంగ్రెస్ నాయకులు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. రాజ్‌భవన్‌లో సీఎల్పీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ నేతలు.. గవర్నర్‌తో సమావేశమయ్యారు.ప్రభుత్వంతో మాట్లాడి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారు గవర్నర్‌ని కోరారు. గతంలో గవర్నర్ పలుమార్లు సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టారు.