హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల కోసం ఉత్తమమైన ప్రజా రవాణా వ్యవస్థను ఏర్పాటు చేసేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూలై 31న జరిగిన తెలంగాణ కేబినెట్ భేటీలో కూడా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆమోదం తెలిపారు. ఇందులో మెట్రో వ్యవస్థను వివిధ ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో మార్గా్న్ని నిర్మించనున్నారు. 


తాజాగా దీనిపై మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పందించారు. మంగళవారం (ఆగస్టు 1) ఎన్వీఎస్ రెడ్డి కొత్త కారిడార్ల గురించి వివరించారు. ప్రాథమిక ప్రాజెక్టు రిపోర్టు (పీపీఆర్) ప్రకారం.. మెట్రో రైలు విస్తరణకు సంబంధించి.. కోటి మంది జనాభాకు సరిపోయేలా మెట్రో వ్యవస్థను విస్తరించేలా ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.


అందులో భాగంగా పటాన్‌ చెరు - నార్సింగ్‌ వరకు 22 కిలో మీటర్లు, తార్నాక - ఈసీఐఎల్‌ క్రాస్ రోడ్స్ వరకు 8 కిలో మీటర్లు, ఎల్బీ నగర్‌ నుంచి పెద్ద అంబర్‌ పేట వరకు, మేడ్చల్‌ జంక్షన్‌ - పటాన్‌ చెరు వరకు 29 కిలో మీటర్లు, పటాన్‌ చెరు - నార్సింగ్‌ వరకు 22 కిలో మీటర్లు, శంషాబాద్‌ - షాద్‌ నగర్‌, ప్యాట్నీ - కండ్లకోయ వరకు, ఉప్పల్‌ - బీబీ నగర్‌ వరకు 25 కిలో మీటర్ల మేర మెట్రో కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించినట్టు ఎన్వీఎస్‌ రెడ్డి వివరించారు.


జూబ్లీ బస్ స్టేషన్ నుంచి తూముకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్ నిర్మిస్తామని తెలిపారు. దీంట్లో పై నుంచి మెట్రో రైలు, కింద వాహనాలు వెళ్లేలా రోడ్డు ఉంటుందని తెలిపారు. ఈ ప్రణాళికలు అన్నీ ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్ట్‌ (పీపీఆర్‌) దశలో ఉన్నాయని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.


నిన్నటి (జూలై 31) కేబినెట్ నిర్ణయాలు ఇవీ


హైదరాబాద్ భవిష్యత్తు అవసరాల నేపథ్యంలో నిన్న సమావేశమైన తెలంగాణ కేబినెట్ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. ప్రజా రవాణాను మరింత సులువు చేయడానికి నగరంలో చేపట్టాలని తలపెట్టిన కొత్త ప్రాజెక్టుల వివరాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ మెట్రోను వివిధ ప్రాంతాలకు విస్తరిస్తామని వివరించారు. కొన్ని మార్గాల్లో కింది నుంచి రోడ్డు, పై నుంచి మెట్రో రైలు వెళ్లేలా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లను నిర్మిస్తామని మంత్రి కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో ప్రజా రవాణా దేశంలోనే అత్యంత మెరుగ్గా ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు ఈ నిర్ణయాలు తీసుకున్నామని కేటీఆర్ వివరించారు.


మెట్రో విస్తరణ ఇలా..
మెట్రో విస్తరణలో భాగంగా మియాపూర్ - ఎల్బీ నగర్ మార్గంలో ఇటు ఇస్నాపూర్ వరకూ, అటు పెద్ద అంబర్ పేట్ వరకూ (విజయవాడ మార్గంలో) మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.  నిజామాబాద్ మార్గంలో జేబీఎస్ నుంచి కండ్లకోయ (ఓఆర్ఆర్) వరకూ విస్తరిస్తామని వివరించారు. 


ఇప్పటికే రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకూ పనులకు శంకుస్థాపన జరిగిందని, అక్కడి నుంచి కొత్తూరు మీదుగా షాద్ నగర్ వరకూ మెట్రో మార్గాన్ని విస్తరిస్తామని చెప్పారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి కందుకూరు వరకూ మెట్రోను పొడిగిస్తామని వివరించారు. ఇటు వరంగల్ మార్గంలో తార్నాక నుంచి యాదాద్రి జిల్లా బీబీ నగర్ వరకూ, ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ వరకూ మెట్రో లైనును పొడిగిస్తామని వివరించారు. 


రూ.60 వేల కోట్లతో
ఈ మొత్తం పొడిగింపులు అన్నీ రూ.60 వేల కోట్లతో చేపడతామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఇంతకుముందు నిర్ణయించిన 101 కిలో మీటర్లకు అదనంగా ఈ కొత్త మెట్రో రైలు పొడిగింపులు ఉంటాయని చెప్పారు. రాబోయే మూడు లేదా నాలుగు ఏళ్లలో ఇవి పూర్తి చేయాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను తయారు చేయాలని మున్సిపల్ శాఖను కేసీఆర్ ఆదేశించినట్లుగా మంత్రి కేటీఆర్ తెలిపారు.