తెలంగాణ విద్యామంత్రి రాజ్‌భవన్‌కు రావాలని గవర్నర్‌ లేఖ రాశారు. యూనివర్శిటీస్‌ కామన్ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుపై చర్చించాలని అందులో పేర్కొన్నారు. ప్రభుత్వంతోపాటు యూజీసికి కూడా గవర్నర్ తమిళిసై లేఖ రాశారు. 


కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చెల్లుబాటు అవుతుందా కాదా అనే అనుమానాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. మూడేళ్లుగా ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి చెబుతున్నా పట్టించుకోలేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విధానంలో న్యాయపరమైన చిక్కులు వస్తే ఖాళీల భర్తీ మరింత ఆలస్యమవుతుందన్నారు. 


తెలంగాణ గవర్నర్ వద్ద చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అవన్నీ కూడా అసెంబ్లీ ఆమోదించిన తర్వాత గవర్నర్‌ వద్దకు పంపించిన బిల్లులే. అలాంటి బిల్లుల్లో తెలంగాణ యూనివర్శిటీస్‌ కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లు ఒకటి. ఇప్పుడు దానిపై వివరణ ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ మంత్రిని గవర్నర్‌ పిలిచారు. ఇప్పుడు ప్రభుత్వం దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. 


ఈ బిల్లుతోపాటు ములుగులోని అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు బిల్లు, రాష్ట్రజీఎస్టీ సవరణ బిల్లు, మున్సిపల్‌ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఏజ్‌ ఆఫ్‌ సూపర్‌యాన్యూయేషన్‌) అమెండ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ మోటర్‌ వెహికల్స్‌ ట్యాక్సేషన్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు, తెలంగాణ ప్రైవేట్‌ యూనివర్సిటీస్‌ సవరణ బిల్లులు గవర్వర్‌ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. 


ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న గవర్నర్‌ తమిళిసై కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. మూడేళ్ల గవర్నర్‌ పదవీ కాలంపై రాసిన పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. ఇది పూర్తిగా సాధారణ పర్యటన అని.. దీనికి ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పారు గవర్నర్.