TPCC Chief Revanth Reddy: రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాభవం పాలైంది. కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక మూడో స్థానానికి పరిమితమైంది. ఈ పరాజయంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని తెలిపారు. ఫలితం కంటే ఎంత నిబద్ధతతో పని చేశామన్నదే ముఖ్యమన్నారు. మునుగోడులో ప్రలోభాలకు లొంగకుండా నికార్సుగా పని చేసిన ప్రతీ కార్యకర్తకు, నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఉత్కంఠగా సాగిన మునుగోడు ఉప ఎన్నికలో టీర్ఎస్ పార్టీ 10 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించింది. విజయంపై ధీమాగా ఉన్న బేజీపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి పరాజయం పాలై రెండో స్థానంలో నిలిచారు.
15 రౌండ్ల ఓట్ల లెక్కింపులో కేవలం మూడు రౌండ్లలోనే బీజేపీ ఆధిక్యం ప్రదర్శించగా, 12 రౌండ్లలో కారు జోరు సాగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో మునుగోడు ఉపఎన్నిక అనివార్యం అయింది. హోరాహోరీగా సాగిన ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై 10,309 వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. లెప్ట్ పార్టీలతో పొత్తు టీఆర్ఎస్ కు కలిసొచ్చిందని అంటున్నారు విశ్లేషకులు. టీఆర్ఎస్ విజయం సాధించడం ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ టీఆర్ఎస్ భవన్ వద్ద టపాసులు కాల్చి వేడుకలు జరుపుకున్నారు.
నల్గొండలో హ్యాట్రిక్ విజయం
మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి పై టీఆరెఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 10 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించింది. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ వరుసగా గెలుపొందింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసింది టీఆరెఎస్. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆరెఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
రాహులో గాంధీ జోడో యాత్రతో ఒరిగిందేమీ లేదు..
మునుగోడు ఎన్నికల సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ జోడో యాత్ర చేసినా ఎలాంటి ఉపయోగమూ లేకుడా పోయింది. తెలంగాణలో సుదీర్ఘంగా 16 రోజులపాటు 19 అసెంబ్లీ, 7 పార్లమెంట్ నియోజకవర్గాల మీదుగా 375 కిలోమీటర్ల మేరకు కొనసాగింది. ఈరోజు మహారాష్ట్రలో ప్రవేశించనుంది. 16 రోజుల యాత్రలో దీపావళికి మూడు రోజులు, నవంబర్ 4న ఒకరోజు సాధారణ బ్రేక్ తీసుకోనున్న రాహుల్ పాదయాత్ర, ఆపై 12 రోజులపాటు జనజీవనంతో ముందుకు సాగింది. కొన్ని ప్రాంతాల్లో కార్నర్ మీటింగులు, మరి కొన్ని ప్రాంతాల్లో ఉదయపు అల్పాహారం, మరి కొన్ని ప్రాంతాలలో నైట్ హాల్ట్ లు చేస్తూ రాహుల్ గాంధీ రోజుకు 20 నుండి 25 కిలోమీటర్ల మేరకు పాదయాత్రతో ముందుకు సాగుతున్నారు.