తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డీఏవీ స్కూల్ వ్యవహారంలో ప్రభుత్వం కాస్త మెత్తబడింది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని అనుమతుల రద్దు నిర్ణయంపై వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి అనుమతులు పునరుద్దరిస్తూ ఆదేశాలు జారీ చేసింది విద్యాశాఖ. 


బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూలు (DAV School Incident)లో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం రేపింది. ఈ దుర్ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... స్కూల్ రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. జరిగిన సంఘటన ఆమోద యోగ్యం కాదని.. కానీ వందల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని స్కూల్ అనుమతుల రద్దుపై పునారోలోచించాలని విద్యార్థుల పేరెంట్స్‌, స్కూల్ యాజమాన్యం వేడుకుంది.  


స్కూల్ అనుమతి పునరుద్దరణ కోసం స్కూల్‌ యాజమాన్యం, పేరెంట్స్ పోరాడారు. ప్రభుత్వ అధికారులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. చివరకు స్కూల్ అనుమతులపై సానుకూల నిర్ణయం తెప్పించుకోగలిగారు. అయితే ఈ అనుమతులు ఈ ఒక్క ఏడాదీకేనంటూ ప్రభుత్వం తేల్చి చెప్పింది. 


అక్టోబరు 26 హైదరాబాద్ డీఈవో (జిల్లా విద్యాధికారి)తో స్కూల్ డైరెక్టర్లు భేటీ అయ్యారు. అదే సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అక్కడకు చేరుకున్నారు. స్కూల్ గుర్తింపు రద్దును వెనక్కి తీసుకోవాలని పేరెంట్స్ ఇచ్చిన వినతి పత్రాలను డీఈవోకు స్కూలు మేనేజ్‌మెంట్ అందజేసింది. 


స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్‌తో జరిపిన చర్చల్లో స్కూల్ యాజమాన్యంతోపాటు స్కూల్ పేరెంట్స్‌ కూడా ఉన్నారు. ఇప్పటికిప్పుడు స్కూల్ అనుమతి రద్దు చేస్తే విద్యార్థలు జీవితాలు అయోమయంలో పడతాయని పేరెంట్స్ వేడుకున్నారు. దీంతో స్కూల్ అనుమతులపై పునరాలోచించేందుకు కమిషనర్ అంగీకరించారు. 


DAV యాజమాన్యం, పేరెంట్స్‌ వాదనలు, అభిప్రాయాలు తెలుసుకున్న విద్యా కమిషనర్‌.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రెండు రోజుల్లో యాజమాన్యం నుంచి రాతపూర్వకంగా రిపోర్ట్ వచ్చిన తరువాత ప్రభుత్వానికి నివేదిక పంపుతామని కమిషనర్ అప్పుడే తెలిపారు. స్కూల్ రీ ఓపెన్‌కి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు అధికారులు వివరించారు. అనుకున్నట్టుగానే వారం రోజుల తర్వాత అనుకూలంగా నిర్ణయం వచ్చింది. 


బంజారాహిల్స్‌లోని డీఏవీ స్కూలు DAV School Incidentలో ఎల్‌కేజీ చదువుతున్న బాలికపై అత్యాచారం జరిగిన ఘటన సంచలనం అయిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపల్‌ డ్రైవర్‌ రజనీ కుమార్‌ (34) లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. స్కూలులో ప్రిన్సిపల్‌ రూమ్ సమీపంలోని డిజిటల్‌ తరగతి గదిలోనే ఆ డ్రైవర్ చిన్నారిపై లైంగిక దాడి చేసినా ప్రిన్సిపల్‌ మాధవి (56) నిరోధించలేకపోయారు. నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కారణమని పోలీసులు ఆమెపై కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ఇద్దరికీ స్థానిక కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. వారిని చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు.


ఈ ఘటనపై వెంటనే స్పందించిన తెలంగాణ ప్రభుత్వం డీఏవీ స్కూల్ గుర్తింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే స్కూల్ రద్దుతో తమ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు కోరారు. వాళ్ల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ ఒక్క ఏడాదికి అనుమతులు ఇచ్చింది.