Medchal Road Accident: అరగంటలో గమ్య స్థానానికి చేరుకుంటామనుకుంటుండగా.. నిద్రమత్తులో వాహనం నడిపి గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొట్టాడు ఓ డ్రైవర్. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉండగా.. ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయ ఓఆర్ఆర్ వద్ద అర్ధరాత్రి టాటా వాహనo, గుర్తు తెలియని వాహనాన్ని ఢీకొనడంతో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు, అంబులెన్స్ కు ఫోన్ చేశారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను యశోద ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో వాహనంలో 12 మంది..
క్షతగాత్రుల్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు సూచిస్తున్నారు. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. గుమాడిదల్లా నుంచి శ్రీశైలం దేవస్థానానికి వెళ్లి దర్శనం చేసుకుని వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక మరో అరగంటలో గమ్యస్థలానికి చేరుకుంటాం అనుకునేలోపే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్ల తన ముందు వెళ్తున్న భారీ వాహనాన్ని ఢీకొట్టాడని.. నిద్ర మత్తు వల్లే డ్రైవర్ తో సహా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారని మేడ్చల్ సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. గతంలో కూడా సదరు డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడంతో.. అతడిని పనిలో పెట్టుకున్న యజమాని సదరు డ్రైవర్ ను తొలగించినట్లుగా తెలిసిందని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా వాహనాల ద్వారా దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఒకే రోజులో వెళ్లటం రావడం లేకుండా చూసుకోవాలని సీఐ వివరించారు. లేదంటే ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వివరించారు. డ్రైవర్ తప్పక విశ్రాంతి తీసుకునేలా చూసుకోవాలని.. సంభవించిన రోడ్డు ప్రమాదం చెప్పకనే చెబుతుందన్నారు.
నిన్నటికి నిన్న ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం - నలుగురు దుర్మరణం
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనక నుంచి వస్తున్న ఓ లారీ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టగా.. ఆ కారు ముందు వెళ్తున్న కంటైనర్ ను ఢీకొట్టింది. దీంతో లారీ, కంటైనర్ మధ్యలో కారు ఇరుక్కుపోయింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే చనిపోగా, మరో మహిళ తీవ్ర గాయాల పాలయ్యారు. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడిన మహిళను కూడా అదే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడకు చెందిన రఫతుల్లా కుటుంబం హైదారాబాద్ కు కారులో వెళ్లి వస్తోంది. అయితే ఆదివారం అర్ధరాత్రి గుడిహత్నూర్ మండలం సీతాగొంది వద్దరు చేరగానే.. ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ షంశు, సయ్యద్ రఫతుల్లా అష్మి, వజాహత్ ఉల్లా, సబియా అనే నలుగురు మృతి చెందగా జుబీయా అనే వైద్యురాలికి తీవ్ర గాయాలయ్యాయి. నలుగురి మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో ఉన్న జుబీయా కు రిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.