Secunderabad: నటుడు సందీప్‌ కిషన్ పార్టనర్‌గా ఉన్న వివాహభోజనంబు హోటల్‌లో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. అక్కడ నాసిరకం పదార్థాలు వాడుతున్నట్టు గుర్తించారు. కేసు నమోదు చేశారు. గత కొన్ని రోజుల నుంచి హైదరాబాద్‌లోని హోటల్స్, హాస్టల్స్, ఫుడ్ సప్లై చేసే కిచన్‌లలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నాసిరకం పదార్థాలు గుర్తించినా పరిసరాలు పరిశుభ్రంగాలేకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. 


అలానే వివాహభోజనంబు హోటల్‌లో అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ చాలా నాసికరంగా ఉన్న పరిసరాలను, ఆహార పదార్థాలను తనిఖీలు అధికారులు గుర్తించారు. FSSAI ఇచ్చిన అధికారిక అనుమతి సర్టిఫికేట్‌ను హోటల్ డిస్‌ప్లే చేసిందని తెలిపారు అధికారులు. అయితే మిగతా రూల్స్ ఫాలో అవ్వడంలో ఫెయిల్ అయినట్టు వెల్లడించారు. 


2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్‌ బ్యాగ్‌ను గుర్తించారు. సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన 500 గ్రాముల కొబ్బరి తురుమును కూడా పట్టుకున్నారు. వండటానికి సిద్ధంగా ఉంచిన ఫుడ్‌, వండేసిన ఫుడ్‌ను స్టీల్‌ గిన్నెల్లో పెట్టి ఉంచారు. కానీ వాటికి సరైన లేబుల్స్ లేవని తేల్చారు. చాలా వరకు చెత్త బుట్టలు ఎలాంటి మూతలు లేకుండానే ఉన్నాయి. 




అన్నింటికంటే ముఖ్యమైంది వైద్య ధ్రువీకరణ పత్రాలు. ఫుడ్‌ను హ్యాండిల్ చేసే వారి ఆరోగ్య స్థితిని తెలియజేసే సర్టిఫికేట్స్‌ లేవు. అయితే వారంతా తలక్యాప్‌లు, యూనిఫామ్‌ వేసుకున్నారు. కిచెన్ పరిసరాల్లో డ్రైన్ నీరు నిల్వ ఉండిపోయింది. వంట కోసం బబుల్ వాటర్ వాడుతున్నారు. అది కస్టమర్స్‌కి ఇస్తున్నారో లేదో మాత్రం తెలియడం లేదు. పెస్ట్ కంట్రోల్ రికార్డ్స్ సరిగానే ఫాలో అవుతున్నట్టు పేర్కొంది. 


గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని పేరున్న హోటల్స్, మాల్స్, హాస్టల్స్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులుతనిఖీలు చేపడుతున్నారు. దాదాపు పేరున్న అన్ని హోట‌ల్స్‌లో నాసిరకం ఫుడ్ పెడుతున్నట్టు గుర్తించారు. వారిపై చర్యలకు ఆదేశాలు జారీ చేశారు.