M Anusuya Is Now Anukathir Surya: హైదరాబాద్‌కు చెందిన ఓ అధికారి తన జెండర్‌ను మార్చుకొని సంచలనం సృష్టించారు. ఇలా జెండర్‌ను మార్చుకున్న తొలి ఐఆర్‌ఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉంటున్న ఆ అధికారి తన అధికారిక రికార్డులతోపాటు అన్నింటినీ మార్చేశారు. గతంలోనే తను పెట్టుకున్న అభ్యర్థనకు భారత ప్రభుత్వం కూడా ఓకే చెప్పడంతో ఇప్పుడు అధికారిక ఉత్తర్వులు వచ్చాయి. ఓ అధికారి ఇలా తన జెండర్‌ను మార్చుకోవడం భారత సివిల్ సర్వీసెస్‌లో ఇదే తొలిసారి.


హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్‌ ఆఫీస్‌లో పని చేస్తున్న ఎం అనుసూయన కొత్త చరిత్రకు నాంధి పలికారు. జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నా 35 ఏళ్ల అనసూయ తన పేరును, తన జెండర్‌ను మార్చేసుకున్నారు. దీనికి భారత ప్రభుత్వం కూడా అంగీకారం తెలపడంతో తన పేరును ఎం అనుకతిర్ సూర్యగా మార్చుకున్నారు. ఇకపై అమ్మాయిని కాదని అబ్బాయినంటూ ప్రకటించారు. అధికారిక ఉత్తర్వులు ప్రకారం "అనుసూయ అభ్యర్థన పరిగణనలోకి తీసుకున్నాం. ఇక నుంచి అన్ని అధికారిక రికార్డుల్లో అనుకతిర్ సూర్య'గా గుర్తిస్తున్నాం." అని ఉంది. 


సోషల్ మీడియా ప్రొఫైల్ ప్రకారం సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగంలో చేరారు. అక్కడే 2018లో డిప్యూటీ కమిషనర్‌గా ప్రమోషన్ వచ్చింది. తర్వాత 2023లో హైదరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేశారు. భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి గతేడాది సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా డిగ్రీ పొందారు. 


జెండర్ గుర్తింపు అనేది వ్యక్తిగత విషయమని నల్సా కేసులో సుప్రీంకోర్టు పదేళ్ల క్రితం స్పష్టం చేసింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఐఆర్‌ఎస్ కేసుతో మరోసారి ఆ కేసు వివరాలు అంతా గుర్తు చేసుకుంటున్నారు.