10 July 2024 News Headlines in Telugu For School Assembly: 

 

1‌) గత ఐదేళ్లలో విద్యుత్‌ శాఖలో చేసిన అప్పులు, నిధుల దారి మళ్లింపు ఇతర అంశాలపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. భవిష్యత్‌లో ఏపీ గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ సప్లైకి హబ్‌గా మారుతుందని అన్నారు సీఎం. ఎన్టీపీసీకి విశాఖలో ఇచ్చిన భూమిలో గ్రీన్‌ హైడ్రోజన్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ అనుమతి కోసం ప్రయత్నాలు  సాగుతున్నట్టు వెల్లడించారు. ఏపీలో రిఫైనరీ ఏర్పాటుకు బీపీసీఎల్‌ రెడీగా ఉందన్నారు. 

 

2) తెలంగాణ డీజీపీగా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి జితేందర్‌ నియామకం దాదాపు ఖరారైంది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు నేడు జారీ కానున్నాయి. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్‌ కానున్నారు.

 

3) రైతు భరోసా పథకం అమలు కోసం విధివిధానాలు ఖరారు చేసేందుకు నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతు సదస్సులు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి 23వ తేదీ వరకు రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటారు. 

 

4) కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి ఇవాళ విశాఖలోని ఉక్కు పరిశ్రమను సందర్శించనున్నారు. అధికారులు, కార్మికులతో మాట్లాడనున్నారు. స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరించేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ కుమార స్వామి ఏం చెబుతారన్న ఉత్కంఠ నెలకొంది. 

 

జాతీయ వార్తల్లోని ముఖ్యాంశాలు

 

5‌) ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దిల్లీలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ముంబైలో జల విలయంతో విద్యాసంస్థలను మూసేశారు. గోవాలో వరుసగా నాలుగోరోజు అతి భారీ వర్షాలు కురిశాయి. 

 

6‌) ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారాన్ని సుమారు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న తెరవనున్నారు. జగన్నాథుని వెలకట్టలేని విలువైన ఆభరణాలను ఐదు కర్రపెట్టెల్లో ఉంచి ఈ రహస్య గదిలో భద్రపరిచారు. 1978 తర్వాత దానిని తెరవలేదు.

 

అంతర్జాతీయ వార్తల్లోని హెడ్‌ లైన్‌

 

7‌) తమ సైన్యంలో ఉన్న భారతీయులను విధుల నుంచి విడుదల చేస్తామని రష్యా తెలిపింది. ఇప్పటికే ఉన్న వారిని కూడా డ్యూటీ నుంచి తప్పిస్తామని తెలిపింది. మోదీతో భేటీ సందర్భంగా పుతిన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

 

క్రీడా వార్తలు

8‌ ) టీమిండియా ప్రధాన కోచ్‌గా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఎంపికయ్యారు. ద్రవిడ్‌ స్థానంలో అతణ్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. భారత్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గడంలో గంభీర్‌ కీలక పాత్ర పోషించాడు.

 

ఇవాళ్టీ మంచిమాట

నా శత్రువులను కూడా స్నేహితులుగా చూసుకుంటాను. అప్పుడు వారిని నాశనం చేయాల్సిన అవసరం ఉండదు- అబ్రహాం లింకన్‌

 

జులై 10 ప్రత్యేకత

ఇవాళ క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ జన్మదినం. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గవాస్కర్‌కు పేరొంది. అత్యధిక టెస్ట్ పరుగులు, టెస్ట్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు.

 

ఇవాళ భారత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జన్మదినం. దేశంలోని అత్యంత సీనియర్ నాయకులలో ఆయన ఒకరు.