ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమాలకు తెర తీస్తోందని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళి లెటర్‌ రాశారు. వెలుగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడంపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రక్రియను ఆపాలని తన ఫిర్యాదులో మురళి పేర్కొన్నారు. 


ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రెండో విడత పనుల్లో భాగంగా కార్మికులను సొరంగం లోపలికి పంపిస్తోంది. ఈ సొరంగం తవ్వేటప్పుడు వచ్చే వ్యర్థాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదానికి దారి తీస్తున్నాయి. సొరంగం తవ్వగా వచ్చే వ్యర్థాలను కొల్లంవాగు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డంప్‌ చేస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆ వ్యర్థాలను రాత్రి వేళల్లో సైలెంట్‌గా లాంచీల్లో తీసుకెళ్లి నదిలో కలిపేస్తోందని తెలంగాణ చేస్తున్న ఆరోపణ. 


ఇలాంటి చర్యల వల్లే శ్రీశైలం తన సామర్థ్యాన్ని కోల్పోతుందని వివరించింది తెలంగాణ. కొన్ని ఏళ్ల నుంచి శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 308.6 టీఎంసీలు అయితే.. ఇప్పుడు అది 215 టీఎంసీలకు పడిపోయిందని లేఖలో పేరొంది. వ్యర్థాలు నదిలో కలిసిన కారణంగా సుమారు వందల టీఎంసీల వరకు నష్టపోతున్నామని తెలిపారు.


ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న చర్యలు కూడా శ్రీశైలం నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ. అలాంటి పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని రిక్వస్ట్ చేసింది తెలంగాణ. సరైన గైడెన్స్ ఇచ్చి శ్రీశైలం జలాశయాన్ని కాపాడాలని కోరింది. నదిలో వ్యర్థాలను డంప్ చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేసింది.