ఎన్నికల కోసం టికెట్ రాలేదని భంగపడ్డ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పాల్వాయి స్రవంతి బీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. ఆదివారం (నవంబరు 12) తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆమె టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. శనివారం (నవంబరు 11) స్రవంతి కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


అనంతరం స్రవంతి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ లోకి రావడం సంతోషంగా ఉందని పాల్వాయి స్రవంతి అన్నారు. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదని తన తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. అందుకే తనకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ లో ఉండాల్సిన అవసరం లేదని, పార్టీ నుంచి బయటకి వచ్చానని చెప్పారు. తన అనుచరులు, కార్యకర్తల భవిష్యత్తును కేటీఆర్ చేతిలో పెడుతున్నామని, తమ భవిష్యత్తుకు అండగా నిలవాలని ఆమె కోరారు. కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న నేతలను కాదని కొత్తవాళ్లకు పదవులు కట్టబెడుతున్నారని అన్నారు. తాను పదవుల కోసం బీఆర్ఎస్ లో చేరలేదని అన్నారు.


‘‘చాలా ఆలోచించి నేను బీఆర్ఎస్ లో చేరాను. ముందుండి నడిపిన నేతలను వెనక్కి నెట్టి కాంగ్రెస్ లో ఇతరులకు అవకాశాలు ఇస్తున్నారు. నేను పదవుల కోసం ఈ పార్టీలో చేరలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ తో మాత్రమే తెలంగాణ అభివృద్ది సాధ్యం. నన్ను నమ్మి వచ్చిన కార్యకర్తలకు, మాకు మీరు భవిష్యత్తు ఇవ్వాలని కేటీఆర్ ను కోరుకుంటున్నా. అందరం కలిసి ముందుకు వెళ్దాం’’ అని పాల్వాయి స్రవంతి మాట్లాడారు.


అసలు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో - కేటీఆర్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఏ కారణం చేత రాజగోపాల్ రెడ్డి పార్టీలు మారాడు అనేది అర్థం కాలేదు. అసలు ఆ ఉపఎన్నిక ఎందుకు వచ్చిందో తెలియదు. మళ్ళీ ఎందుకు కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి చేరాడు. గత ఏడాది ఎన్నికలకు అయోమయం గందరగోళం. మాకు పాల్వాయి కుటుంబంతో అనుబంధం ఉంది. తెలంగాణ బాగుండాలని కోరుకున్న వ్యక్తి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్ లోనే ఉంటాను అని చెప్పారు గోవర్దన్ రెడ్డి. కానీ అలాంటి కుటుంబంలో ఉన్న ఆయన కూతురికి కూడా టికెట్ ఇవ్వకపోవడం దారుణం. గత ఏడాది జరిగిన ఎన్నికలలో పాల్వాయి స్రవంతి లేకపోతే ఆ ఓట్లు కూడా కాంగ్రెస్ కు వచ్చేవి కావు. రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకరికొకరు ఇష్టం వచ్చినట్లు తిట్టుకున్నారు.


కొద్ది రోజుల్లో కొత్త కుట్రలు
ఇప్పుడు బుజంపై చేతులేసుకొని తిరుగుతున్నారు. మునుగోడులో మాతో కలిసి వచ్చే అందరికీ స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కలిపిస్తాం. డబ్బు మదంతో వంద కోట్లతో మళ్ళీ ఖర్చు పెట్టి గెలుస్తానని రాజగోపాల్ చూస్తున్నాడు. కచ్చితంగా ఈ సారి రాజగోపాల్ రెడ్డి ని ఓడించాలి. మన జీవితాల్లో వెలుగులు నింపిన కేసిఆర్ కావాలా? లేదా కారు చీకట్లు తెచ్చే కాంగ్రెస్ కావాలా? మరోసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఈ పదిహేను రోజుల్లో కొత్త కుట్రలు రాబోతున్నాయి. కాళేశ్వరం కూలింది అని, రెండు రోజుల్లో నివేదికలు రెడీ చేసి పంపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ, మోదీ కొత్త కొత్త రిపోర్టులు తయారు చేసి ఢిల్లీ నుంచి పంపిస్తారు. దేశంలో కేసీఆర్ చక్రం తిప్పకుండా కొత్త కుట్రలు చేస్తారు. 


ఈ పదిహేను రోజులు ఇవే కుట్రలు చేస్తూ మనల్ని మన ఆలోచన మార్చేలా చేస్తారు. ధనం ఉందని, జనాన్ని కొంటానని రాజగోపాల్ రెడ్డి చూస్తున్నాడు. రాజగోపాల్ రెడ్డి డబ్బు మదాన్ని ఈ ఎన్నికల్లో అనిచి వేయాలి. గువ్వల బాల్ రాజ్ పై నిన్న దాడి చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు మంచిది కాదు. ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము లేక భౌతిక దాడులు చేస్తున్నారు. నేను ఆసుపత్రికి వెళ్తున్నా ఆయన్ని పరామర్శిస్తా’’ అని మంత్రి కేటీఆర్ మాట్లాడారు.