Telangana Congress: ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం పూర్తి అయింది. రెండు రోజుల పాటు కాగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం సాగిస్తుండగా.. ఈరోజే దాదాపు ఐదు గంటల పాటు కొనసాగింది. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా దాదాపుగా పూర్తి అయినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో సర్వే రిపోర్టు, సామాజిక వర్గం, బలమైన అభ్యర్థి అంశాలపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించింది. ఏకాభిప్రాయంతో 60 శాతానికి పైగా అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ వార్ రూములో స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ నాయకత్వంలో ఈ సమావేశం జరిగింది.
స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి జిగ్నేష్ మేవాని, బాబా సిద్దిక్, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీ, భట్టి విక్రమార్క హాజరు అయ్యారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసిన రాష్ట్ర నాయకత్వం.. ఆ నివేదికను ఢిల్లీ సమావేశానికి తీసుకువచ్చింది. 119 నియోజవర్గాలకు దాదాపు 300 పేర్లను స్క్రీనింగ్ కమిటీకి తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే అభ్యర్థులను ఖరారు చేశారు.
అసంతృప్త స్వరాలు తగ్గించే యత్నం
తెలంగాణ కాంగ్రెస్ లో గతంలోలా పరిస్థితులు లేకుండా సీనియర్ నేతలందర్నీ లైన్లో పెడుతున్నారు. ఎన్నికలకు సంబంధించి కమిటీల్లో ప్రాధాన్యం దక్కడం లేదని ఫీలవుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కీలకు తాజాగా… స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు.. ఇటీవల వారిద్దరూ… అసంతృప్తిగా ఉంటున్నారు. వెంటనే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించారు. మరో వైపు బుస్సు యాత్రకు కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేసింది. పార్టీ ముఖ్య నేతలతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి చేపట్టాలని ప్రాథమికంగా తీర్మానించిన నేతలు.. తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ఈ బస్సు యాత్రలో సీనియర్లు అందరూ పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ఉందని.. స్థిరమైన పాలన అందిస్తామని ప్రజలకు నమ్మకం కలిగేలా ఈ యాత్ర ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ లో అసంతృప్త స్వరాలు తగ్గిపోయాయి. పెద్దగా పార్టీకి ఎవరూ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు.
రేవంత్ రెడ్డి పూర్తిగా డామినేట్ చేస్తున్నారన్న విమర్శలు, అలకలు ఉన్నప్పటికీ… .ఆయనకు పూర్తిగా చార్జ్ ఇవ్వలేదని… హైకమాండ్ ఆలోచనతోనే అన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్న సంకేతాలు కూడా గట్టిగా పంపడంతో.. కాంగ్రెస్ లో పరిస్థితి లైన్ లోకి వచ్చిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అలాగే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలో దిగేందుకు మధుయాష్కి గౌడ్ దరఖాస్తు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది.
ఇక్కడి నుండి పోటీ చేసేందుకు పార్టీ సీనియర్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మల్ రెడ్డి రాంరెడ్డిలు సంవత్సరాలుగా తమ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. టీపీసీసీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు చేపడుగూ నిత్యం ప్రజల మద్య ఉంటూ వస్తున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ తాను స్థానికుడినే అంటూ ఎల్బీ నగర్ నుండి పోటీ చేసేందుకు ముందుకు రావడంతో సెగ్మెంట్ కాంగ్రెస్ నాయకులలో ఆందోళన మొదలైంది.