Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చాలా కీలక విషయాలపై నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. అందులో ఒకటి మంత్రి వర్గ విస్తరణ, రెండోది పీసీసీ చీఫ్ నియామకం, మూడోది నామినేటెడ్ పోస్టుల భర్తీ. ఈ మూడు విషయాల కోసం కాంగ్రెస్ నేతలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఇదిగో విస్తరణ, అదిగో కొత్త పీసీసీ అంటూ రకరకాల లీకులు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాదని తేలిపోయింది. 


అన్నింటికీ శ్రావణ మాసాన్ని ముహూర్తంగా చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా టూర్‌లో ఉన్న రేవంత్ రెడ్డి స్వరాష్ట్రానికి వచ్చిన తర్వాత ఢిల్లీ వెళ్తారని తెలుస్తోంది. అధినాయకత్వంతో ఈ మూడు విషయాలపై ఫైనల్‌గా మాట్లాడుకొని మంచి ముహూర్తం చూసుకని కీలక ప్రకటన చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఒక దఫా నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంకా కీలకమైన విభాగాలు ఉండనే ఉన్నాయి. వాటిలో కొన్నింటినీ రెండో దఫాలో ప్రకటిస్తారని అంటున్నారు. 


మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై ఎప్పటి నుంచో కసరత్తు జరుగుతోంది. వివిధ దఫాలు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్, ఇతర సీనియర్ నేతలు అధినాయకత్వంతో ఈ మూడు అంశాలపై చర్చించారు. ఇంతలో బీఆర్‌ఎస్‌ నుంచి కీలకమైన నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో వారికి ఛాన్స్ ఇస్తారేమో అని మరికొందరు కంగారు పడి అధినాయకత్వానికి విన్నపాలు చేశారు. 


అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌లోకి కొత్తగా వచ్చి చేరే వారిని కీలక పదువులు అప్పగించవద్దని చాలా మంది సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు చాలా మంది పార్టీ కోసం కష్టపడి పని చేశారని వారినే పరిగణలోకి తీసుకొవాలని చెప్పుకొచ్చారు. దీన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకత్వం కొత్తగా పార్టీలో చేరే వారికి మంత్రిపదవులు ఇవ్వడం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. 


ఇన్ని రోజులు వివిధ కారణాలతో మూడు విషయాలపై దాటవేత ధోరణితో వచ్చిన కాంగ్రెస్‌కు ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చింది. మరికొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో కాంగ్రెస్ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలంటే వారిని ప్రోత్సహించాల్సి ఉందని అంటున్నారు నేతలు. ఇప్పుడు ఇటు పీసీసీ చీఫ్‌గా అటు సీఎంగా రెండు పదవులను నిర్వహిస్తున్న రేవంత్‌కు నేతల సమన్వయం ఇబ్బంది మారుతోందని చెబుతున్నారు. అందుకే పీసీసీ చీఫ్ నియామకం కూడా తప్పనిసరికానుంది. 


ఖాళీగా ఉన్న ఆరు పోర్ట్‌పోలియోలకు మాత్రం భారీగా పోటీ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దాదాపు 15 మంది వరకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారట. సామాజిక కోటాలు, స్థానికత అంశాలను తెరపైకి తీసుకొచ్చి మంత్రిగా అవ్వాలని తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. కొందరు రేవంత్ రెడ్డితో ప్రయత్నాలు చేస్తుంటే మరికొంత మంది నేరుగా అధినాయకత్వంతోనే సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారం. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి మాత్రం బీసీ, లేదా ఎస్సీ, ఎస్టీ సమాజిక వర్గానికి ఇవ్వాలని ఓ అభిప్రాయానికి వచ్చినందున ఆ సామాజిక వర్గ నేతలే లాబీయింగ్ చేసుకుంటున్నారు.