Telangana: తెలంగాణ అభివృద్ధిలో యువత పాత్ర పోషించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాసబ్‌ట్యాంక్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణలో ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. విద్యా బుద్దులు నేర్చొని ఉపాధి అవకాశాలతో పేరు తీసుకురావాల్సిన యువత పక్కదారి పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, ఇతర డ్రగ్స్ మత్తులో ఊగుతోందని ఆందోళన చెందారు.
డ్రగ్స్ కల్చర్ చాలా ప్రమాదకరంగా మారుతోందన్నారు రేవంత్. ముఖ్యంగా బీటెక్ విద్యార్థులు ఈ డ్రగ్స్ బారిన ఎక్కువ పడుతున్నారని ఇది మరింత ఆందోళనకరమన్నారు. వారు డ్రగ్స్ వాడటమే కాకుండా పెడ్లర్స్‌లా మారుతున్నారని కామెంట్ చేశారు. ఇలాంటి వారిని పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకొని కౌన్సిలింగ్ ఇవ్వడం చేస్తున్నారని అన్నారు.
ఇలా ఇంజినీరింగ్ విద్యార్థులు డ్రగ్స్ బారిన పడటానికి కాలేజీలు కూడా ఓ కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. విద్యాబోధన సరిగా లేకపోవడం, కాలేజీలో పట్టించుకునే వాళ్లు లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి వస్తోందని అన్నారు. అందుకే కచ్చితంగా వీటిపై దృష్టి పెట్టాలని కాలేజీలుకు సూచించారు. విద్యాబోధనపై దృష్టి పెట్టకుంటే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. అవసరమైతే కాలేజీ గుర్తింపు కూడా రద్దు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.
ప్రభుత్వం తరఫున యువతకు ఎన్ని విధాలుగా సాయం చేయాలో అన్ని విధాలుగా సాయం చేస్తున్నామని వాటిని అందిపుచ్చుకొని ఎదగాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూనే ప్రైవేటు పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తున్నామని తెలిపారు. ఎలాంటి కోర్సులు చదవాలి ఏ విభాగంలో స్కిల్ డెవలప్‌మెంట్ చేయాలో కూడా పరిశ్రమలతో చర్చిస్తున్నామన్నారు.
Also Read: ఆక్రమణకు గురికాకుండా చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు - సీఎం రేవంత్ రెడ్డి