Hyderabad: తనపై నమోదైన రేప్ కేసుపై యూట్యూబర్ హర్షసాయి(Harsha Sai) తొలిసారిగా సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టుపారేశాడు. డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నారని, త్వరలోనే నిజం బయటకు వస్తుందని తన గురించి తన అభిమానులందరికీ తెలుసని అన్నాడు. ఇక లీగల్ ఇష్యూస్ ని తన తరపున ఉన్న న్యాయవాది చూసుకుంటారని క్లారిటీ ఇచ్చాడు హర్షసాయి. 


హర్షసాయి వివరణలో కొత్త విషయమేమీ లేదు. సహజంగా ఆరోపణలు వచ్చిన తర్వాత అందరూ చెప్పే మాటలే హర్షసాయి కూడా చెప్పాడు. తన తప్పేమీ లేదని అన్నాడు. అయితే డబ్బుల కోసమే తనపై మిత్రా శర్మ(Mithra Sharma) కేసు పెట్టారని హర్షసాయి చెప్పడం ఇక్కడ విశేషం. హర్షసాయి హీరోగా నటిస్తున్న 'మెగా' మూవీ నిర్మాత మిత్రా శర్మ. ఆమె బిగ్ బాస్ ప్రోగ్రామ్ కంటెస్టెంట్ కూడా. ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమెకు హర్షసాయి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా హర్షసాయిని హీరోగా పెట్టి ఆమె సినిమా ప్రొడ్యూస్ చేసేంత వరకు వచ్చింది. అయితే తన దగ్గర రూ.2 కోట్లు తీసుకున్నారని, తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, తీరా ఇప్పుడు మోసం చేశాడని ఆరోపించారు మిత్రా శర్మ. హర్ష సాయి తండ్రిపై కూడా ఆమె నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం. తండ్రీ కొడుకులిద్దరిపై చర్యలు తీసుకోవాలని, తనకి న్యాయం చేయాలని ఆమె కోరారు. 



మిత్రా శర్మ ఫిర్యాదుతో నార్సింగి(Narsingi) పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. సెక్షన్ 328, 376 (2) 354 , 376ఎన్ కింద కేసులు నమోదు చేశారు. బాధిత యువతి స్టేట్‌మెంట్‌ రికార్డు చేసి, కొండాపూర్‌లోని ఆస్పత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు కూడా చేయించారు. అయితే కేసు వ్యవహారం వెలుగులోకి రావడంతో హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణ పరారీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా హర్షసాయి సోషల్ మీడియా ద్వారా రియాక్ట్ కావడం విశేషం.


Also Read: హీరో రాజ్ తరుణ్ టూ హర్షసాయి, హైప్రొఫైల్ కేసులకు అడ్డాగా నార్సింగి పోలీస్ స్టేషన్ 


ఇటీవలే ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ వ్యవహారం ఏపీలో సంచలనంగా మారింది. ఏకంగా ఐపీఎస్ అధికారులు సైతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ముంబై నటి ఫిర్యాదుతో యూట్యూబర్ హర్షసాయి చిక్కుల్లో పడటం విశేషం. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు సంచలనంగా మారుతున్నాయి. సినీ రంగానికి సంబంధించి ఇటీవల హీరో రాజ్ తరుణ్, డ్యాన్స్ మాస్టర్ జానీ, ఇప్పుడు యూట్యూబర్ కమ్ హీరో హర్షసాయి.. ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రాజ్ తరుణ్ వ్యవహారం ఇంకా జైలు వరకు వెళ్లలేదు. డ్యాన్స్ మాస్టర్ జానీ మాత్రం తీవ్ర ఆరోపణల కారణంగా జైలుకి వెళ్లారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు హర్షసాయి బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరి మిత్రా శర్మ ఆరోపణల్లో నిజమెంత..? మెగా మూవీ నిర్మాణంలో ఆమె పాత్ర ఎంత..? అసలు హర్షసాయితో వ్యవహారం ఎక్కడ తేడా కొట్టింది..? ఈ వివరాలన్నీ ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉన్నాయి. 


Also Read: యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదు, మోసం చేశాడని బిగ్ బాస్ ఫేమ్ మిత్రా శర్మ ఫిర్యాదు