KTR News: దేశ రాజకీయాల్లోనే సంచలనం కలిగించే వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ చేశారు. హైదరాబాద్‌లో జరగబోయే మూసీ నది సుందరీకరణ పనుల విషయంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌ అవుతున్నాయి. ఫతేనగర్‌లోని సీవేజ్‌ ప్లాంట్‌ పని తీరు పరిశీలించేందుకు వెళ్లిన కేటీఆర్‌ ప్రభుత్వం, రేవంత్‌రెడ్డి, మూసీ సుందరీకరణ పనులపై హాట్ కామెంట్స్ చేశారు. 


మూసీ సుందరీకరణ పనులు పాకిస్థాన్ కంపెనీకి సీఎం రేవంత్ రెడ్డి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్. మూసీ సుందరీకరణ ప్రక్రియను తాము ప్రారంభించామని గుర్తు చేశారు. మూసీలో కొత్తగా చేయడానికి ఏం లేదని చెప్పారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా చేసిందన్నారు. అయినా సరే మూసీ ప్రాజెక్టు కోసం లక్షా 50 వేల కోట్లు అని ఒకసారి 50 వేల కోట్లు అని ఇంకొకసారి, 70వేల కోట్ల మరోసారి రేవంత్ చెబుతున్నారని విమర్శించారు. మీరు చేయాల్సిన పనులను గతంలోనే చేశామన్నారు. ఇప్పుడు అంత ఖర్చు పెట్టి ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 


మూసీ ప్రక్షాళనను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎప్పుడో చేపట్టిందన్నారు కేటీఆర్. అందులో భాగంగానే ప్రతిరోజూ 20 కోట్ల లీట‌ర్ల మురికి నీటిని శుద్ధి చేయాలనే ఉద్దేశంతో 4 వేల కోట్ల రూపాయలతో 31 ఎస్టీపీల‌ు ఏర్పాటు చేశామన్నారు. వంద శాతం సీవ‌రేజ్ ట్రీట్‌మెంట్‌ చేసే సిటీగా హైదరాబాద్‌ను మార్చాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. కూక‌ట్‌ప‌ల్లి ఫ‌తేన‌గ‌ర్‌లోని 133 ఎంఎల్‌డీల‌ ఎస్టీపీ ప్రారంభానికి రెడీగా ఉందని త్వరలోనే మిగతా ప్రాంతాల్లోని ఎస్టీపీలను సందర్శిస్తామన్నారు. 


మురికి నీరు వెళ్లడంతోనే మూసీకి ఈ దుస్థితి వచ్చిందని అన్నారు కేటీఆర్. ఈ ఎస్టీపీలన్నీ పని చేసి స్వచ్ఛమైన నీరు మూసీలోకి వెళ్తే ప్రత్యేకంగా సుద్ధి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. అలాంటి విషయంపై సీఎంతోపాటు మిగతా ముంత్రులు కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలా రోజుకో రకమైన మాటలు వింటుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని విమర్శించారు. 


ఈ సుందరీకరణ పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని దాన్ని బయటకు తీస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్‌కు చెందిన కంపెనీల‌కు ఈ పనులు కట్టబెట్టే ప్రయత్నాల్లో రేవంత్ ప్రభుత్వం బిజీగా ఉందన్నారు. అన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా బుద్ది చెప్పే టైం వస్తుందని జోస్యం చెప్పారు. సుంద‌రీక‌ర‌ణ పేరితో నాటకాలు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అన్నారు. అక్కడ కొత్తగా చేయాల్సిందేమీ లేదన్న కేటీఆర్... రైతుభ‌రోసా లాంటివి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప‌బ్లిసిటీ స్టంట్ల‌తో ఎక్కువ కాలం ప్రజలను మభ్యపెట్టలేరని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వం హైద‌రాబాద్‌కు చేసిన మంచి ప్రజలకు బాగా తెలుసు అన్నారు. 


మూసీ చుట్టూ ఉన్న వాళ్లకు 12 వేల డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్లు ఇస్తామన్న రేవంత్ ప్రకటనను కేటీఆర్ స్వాగతించారు. అయితే గతంలో చేసిన ప్రకటనలు వెనక్కి తీసుకోవాలని అన్నారు. ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా కట్టించలేదని ఆరోపణలకు ఇచ్చే సమాధానమేంటని నిలదీశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి విక్రమార్కను నగరమంతా తిప్పి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. అంతే కాకుండా ఇప్పుడు అవే ఇళ్లను మూసీ బాధితులకు ఇస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వాటిని కేసీఆర్ ప్రభుత్వం కట్టకపోయి ఉంటే... ఇప్పుడు ఎలా ఇచ్చేవాళ్లని అడిగారు. ఫార్మా సిటీ భూసేకరణపై కూడా రకరకాల ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు కేటీఆర్.