Telangana CM Revanth Comments :పేదలను రక్షణ కవచంగా పెట్టుకొని అక్రమ కట్టడాలు కూలగొట్టొద్దనే డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్‌లను కాపాడుకునే ప్రయత్నాల్లో బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని విమర్శించారు. జెన్వాడలో ఉన్న కేటీఆర్‌ ఫామ్ హౌస్ అక్రమంగా కట్టింది కాదా అని ప్రశ్నించారు. అది కూలగొట్టాలా వద్దో చెప్పమన్నారు. అజీజ్‌ నగర్‌లో ఉన్న హరీష్‌ రావు ఫామ్‌ హౌస్‌ అక్రమమా కాదా అని నిలదీశారు. సబితమ్మా... నీ ముగ్గురు కొడుకుల పేర్లు మీద మూడు ఫామ్‌ హౌస్‌లు కట్టినవ్ కదా అని నిలదీసిన రేవంత్ ... పేద అరుపులు అరవద్దని సూచించారు. మీకున్న ఫామ్‌హౌస్‌లు కూడా బయటకు వస్తాయన్నారు. సబితా ఇంద్రారెడ్డికి వెనకాలే ఉన్న కేవీపీ రామచంద్రరావు ఫామ్‌హౌస్‌లు కూల్చాలా వద్దా అని ప్రశ్నించారు. 


నిలదీతలు తప్పవని గ్రహించి.. 


ఎక్కడ ఫామ్‌హౌస్‌లు కూలిపోతాయో అన్న భయంతో పేదలను రక్షణ కవచంగా మార్చుకున్నారని మండిపడ్డారు రేవంత్ నల్లజెరువులో అక్రమంగా ప్లాట్లు వేసి అమ్మింది బీఆర్‌ఎస్ లీడర్ కాదా అని అన్నారు. మూసీ నది పక్కనే ప్లాట్లు వేసి పది లక్షలకు అమ్మింది కూడా వాళ్లే అన్నారు. ఇలా చెరువుల్లో అక్రమ వెంచర్లు వేసి అమ్మేసి బాధితులు నిలదీస్తారని గ్రహించి ముందే పార్టీ శ్రేణులను ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. 


పేదలు బాధ నాకు తెలియదా?


పేదల ఇళ్లు తీస్తే వాళ్లు పడే బాధ తనకు తెలుసన్నారు రేవంత్. ఇలాంటివి చేస్తే రాజకీయంగా లాభమో నష్టమో అంచనా వేయలేనా... 20 ఏళ్లు ప్రజల్లో తిరిగినవాడిని పేదల కష్టం తెలియకుండానే రాష్ట్రాన్ని సీఎం అయ్యానా అని ప్రశ్నించారు. అన్నీ పక్కన పెడితే నగరాన్ని కాపాడుకునే బాధ్యత మనకు లేదా అని అడిగారు.హైదరాబాద్‌కు తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్,హిమాయత్ సాగర్‌లో బలిసినోళ్లు ఫామ్‌ హౌస్‌లు కట్టుకుంటే కూల్చొద్దా అని ప్రశ్నించారు. వాళ్ల డ్రైనేజీని తీసుకెళ్లి ఉస్మాన్ సాగర్, గండిపేటలో కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల డ్రైనేజీ నీళ్లు నగరం తాగాలనడం ఎంత వరకు కరెక్టని నిలదీశారు. 


ఒక్కొక్కటిగా మారుస్తూ వస్తున్నాం


మూసీ పేరుతో ఇంకా ఎన్ని రోజులు బతుకుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఏం చేయాలో చెప్పడం మానేసి ఇవేం రాజకీయాలని నిలదీశారు. ఇల్లు కట్టి నష్టపోయిన వాళ్లకు ఏం చేయాలో చెప్పాలని సవాల్ చేశారు. ఒక్కొక్కరికి ఎంత నష్టపరిహారం ఇద్దామో చెప్పండని... ఒకే వేదికపై పంచుదామని అన్నారు.   
అధికారం కోల్పోయిన కేటీఆర్‌ విచక్షణ కూడా కోల్పోయారని విమర్శించారు. పదేళ్లు ఏలి ప్రజల ఉసురుక పోసుకున్న బీఆర్‌ఎస్‌ను ఓడించారు. ఈ ప్రభుత్వం వచ్చాక 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 35 వేల ఉద్యోగాలు డిసెంబర్‌లోపు ఇవ్వాలని నిర్ణయించాం. వైద్య రంగంలో వేలాది మందిని నియమించాం. ఇలా ఒక్కో సమస్యను పరిష్కరించుకొని పాలన సాగిస్తున్నాం. హైదరాబాద్‌ ట్రాఫిక్ సమస్యను, వరదలను నియంత్రించే పనిలో ఉన్నాం. 


మూసీ బాధితులకు డబ్బులు ఇవ్వొచ్చుకదా


బురదలో మునిగిపోతున్న హైదరాబాద్‌ను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలపై బావబావమరిది బుదరజల్లుతూ తిరుగుతున్నారని ఆరోపించారు. కిరాయి మనుషులతో మీరు చేసే హడావుడి తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని హెచ్చరించారు. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్న వాళ్లు తెలంగాణ ప్రజలను దోచుకున్న డబ్బు పార్టీలో ఉంది కదా.. అందులోంచి ఐదు వందల కోట్లు తీసుకొచ్చి మూసి బాధితులకు ఇవ్వొచ్చు కదా అని సలహా ఇచ్చారు. 


మీకు అధికారంలోకి రావడానికి ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవని ఇప్పుడు మీ పార్టీ ఖాతాలో ఉన్న సొమ్ము ఎవరిదని నిలదీశారు రేవంత్. అది ప్రజల డబ్బేనన్నారు. మూసీ కంపులో బతుకుతున్న వారికి ప్రత్యామ్నాయం ఏంచేయాలో చెప్పాలని ప్రశ్నించారు. ఎవరు ఎలాంటి సలహాలు ఇచ్చినా వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 


హైడ్రాపై అసెంబ్లీలో చర్చపెట్టినప్పుడు ఈ బీఆర్‌ఎస్ నేతలు పారిపోయారని అన్నారు రేవంత్. ఆ రోజు సూచనలు చేసి ఉంటే... ఇవాళ అడ్డగోలుగా మాట్లాడే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ఇవాళ పేదలకు ఏం చేద్దామో చెప్పాలని అడిగారు. పేదలకు ఎవరి తాత సొమ్మో ఇవ్వడం లేదని ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన డబ్బులనే ఇస్తున్నామన్నారు. బఫర్ జోన్‌లో, మూసీ తీరంలో 12000 వేల మందిని గుర్తిస్తే వాళ్లకు 15000వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. 


మూసీ కంపులో దోమల్లో చాలా ఘోరమైన పరిస్థితుల్లో బతుకున్న వారిని గౌరవ ప్రదంగా ఇళ్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు 25వేలు ఇస్తే అన్యాయంగా మాట్లాడుతున్నారని ఆన్నారు రేవంత్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పాలని అన్నారు. బాధ్యత తీసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రత్యామ్నాయాలు చూపించాలని సవాల్ చేశారు. 


మూసీపై అఖిల పక్షం 


మూసీపై అఖిలపక్ష సమావేశం పిలుస్తామని బీఆర్‌ఎస్ నేతలు కూడా రావాలని సూచించారు రేవంత్ రెడ్డి. వచ్చి ఏం ప్రత్యామ్నాయాలు ఉన్నాయో చెప్పాలన్నారు. మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదీ చేయొద్దని చెప్పడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు. పదినెలలు కాకుండానే విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకొని ఆగర్భ శ్రీమంతలు అయ్యారని విమర్శించారు. 


Also Read: కొండా సురేఖ వివాదాన్ని ముగిద్దాం- సినీ ప్రముఖలకు కాంగ్రెస్ విజ్ఞప్తి