Hyderabad News: నీరు, విద్యుత్ కొరత కారణంగా తెలంగాణలోని యూనివర్శిటీలు మూసివేస్తున్నారన్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తిప్పికొట్టారు. కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోందని విమర్శలు చేశారు. వెళ్లి ప్రతి చోట ఉస్మానియా యూనివర్శిటీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత రెండు మూడు రోజుల నుంచి జరుగుతున్న ప్రచారంపై ఎక్స్‌(గతంలో ట్విటర్) వేదికగా స్పందించిన  రేవంత్ రెడ్డి... గతంలో కూడా వేసవి సెలవులు సమయంలో ఇలాంటి సర్క్యులర్ వచ్చిందని అన్నారు. అదేదో ఇప్పుడే వచ్చినట్టు కొందరు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. 


సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి చేసిన పోస్టులో ఏమన్నారంటే..."మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు.


కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మే లో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుంచి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. 


కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట. అని రేవంత్‌ విమర్శలు చేశారు.