CM Revanth Reddy Comments On BRS MLAs Joinings : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు...కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) అపాయింట్‌మెంట్ కోరినా ఇస్తానని ముఖ్యమంత్రి (Chief Minister) రేవంత్ రెడ్డి (Revanth Reddy ) వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు ఎప్పుడైనా కలవొచ్చని...అందరికి అపాయింట్మెంట్ ఇస్తానని వెల్లడించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావొచ్చన్నారు. తాను అందుబాటులో లేని సమయంలో...డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి సమస్యలను తెలియజేయవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి....సాగునీటి శాఖ పరిస్థితిపై ఫిబ్రవరిలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రం విడుదల చేస్తామని వెల్లడించారు. ఇరిగేషన్‌‌‌‌ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ కోసం సిట్టింగ్ జడ్జిలను కేటాయించాలని చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌కు లేఖ రాశామన్న రేవంత్ రెడ్డి...ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణ జరుగుతోందన్నారు. 


దేవుళ్లకు రాజకీయాలను ముడిపెట్టొద్దు
రాజకీయాలను దేవుడితో ముడిపెట్టొద్దని రేవంత్ రెడ్డి కోరారు. భద్రాచలంలో రాముడు ఉన్నాడన్న ఆయన, భక్తులందరూ వెళ్లి దర్శించుకోవచ్చన్నారు. దేవుడికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. ఎవరికి వీలైనప్పుడు వాళ్లు వెళ్లి రాముడ్ని దర్శించుకుంటారని తెలిపారు. విద్వేషాలను రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ కుట్రలు చేస్తోందని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్, ప్రధాన మంత్రి మోడీ ఒక్కటేనన్న ఆయన...వాళ్లిద్దరూ చీకటి దోస్తులంటూ మండిపడ్డారు. కేసీఆర్ రూ.7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయిస్తే, మోడీ వంద లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంలో ఇద్దరిదీ ఒకటే స్టైల్ అన్న రేవంత్ రెడ్డి... అప్పులు చేసి ప్రజల నెత్తిన మోపడంలోనూ వారికి వారే సాటి అని విమర్శించారు. ప్రతి వ్యక్తి అకౌంట్ లో రూ.15 లక్షలు వేస్తానన్న మోడీ.. చిల్లిగవ్వ కూడా పేదలకు ఇవ్వలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పిన ప్రధాని మోడీ... కనీస మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని విమర్శించారు.


పులి బయటకు వస్తే ఏమీ జరగదు
పులి బయటకు వస్తుందని, ఆయన వస్తే ఏదో జరుగుతుందన్నట్టు బీఆర్‌‌‌‌ఎస్ వాళ్లు మాట్లాడుతున్నారని... కానీ ఏమీ జరగదన్నారు. కేసీఆర్ బయటకొస్తే బోనులో వేయడానికి ప్రజలు, యువత సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు. లోక్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ను ఓడించేందుకు కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ చీకట్లో మోడీతో మంతనాలు సాగిస్తున్నారన్న రేవంత్ రెడ్డి....అందుకే బిల్లా, రంగాలు బీజేపీని పల్లెత్తు మాట అనడం లేదని అన్నారు. కాంగ్రెస్‌‌ను నిలువరించి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలన్నదే వారి చీకటి ది వాళ్ల చీకటి ఒప్పందమని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్‌‌‌‌ఎస్‌‌ను ఇప్పటికే ప్రజలు బొంద పెట్టారని, ఇప్పుడు మోడీని దించేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. లోక్‌‌‌‌సభ ఎన్నికల్లో వాళ్లిద్దరినీ కలిపి ఓడిస్తామన్నారు రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 3న సాయంత్రం 5 గంటల వరకు గాంధీ భవన్‌‌‌‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.25 వేలు.. మిగతా అన్ని వర్గాలకు రూ.50 వేలు ఉంటుందని వెల్లడించారు.