Koti Womens University Renamed As Chakali Ilamma University: హైదరాబాద్: చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాన్ని ప్రకటించారు. హైదరాబాద్ కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు రేవంత్ తెలిపారు. తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగించాలని రాష్ట్ర ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు. సాయుధ రైతాంగ పోరాటం అంటే గుర్తుకొచ్చే పేరు ఐలమ్మ అని పేర్కొన్నారు.
చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ (Telangana Women Commission) సభ్యురాలిగా నియమించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. దుర్మార్గాలు, అవినీతిపై పోరాటం సాగించిన వీరనారి చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని తాము భావిస్తున్నట్లు చెప్పారు. ఆనాడు తెలంగాణలో దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాల భూములను పేదలకు, పీడిత వర్గాలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేయడం అందరికీ తెలిసిందే. చాకలి ఐలమ్మ స్పూర్తితోనే దివంగత ప్రధాని ఇందిరా గాంధీ భూసంస్కరణలు తెచ్చారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
పేదవాడి ఆత్మగౌరవం సొంత భూమి, సొంత జాగా అని భావించి.. అందుకే ఇందిరాగాంధీ పేదలకు లక్షల ఎకరాల భూమి పంచిపెట్టారని పేర్కొన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు దారుణంగా వ్యవహరిస్తున్నాయని.. తెలంగాణలో పదేళ్లపాటు పాలన సాగించిన బీఆర్ఎస్ నేతలు ధరణి ముసుగులో పేదల భూములను గుంజుకునే కుట్ర జరిగిందని ఆరోపించారు. కనుక పేదల భూములను కాపాడేందుకే చాకలి ఐలమ్మ స్పూర్తితో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
కంచె ఐలయ్య సూచన చేశారు, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం..
భూములు కేవలం కొందరు దొరలు, భూస్వాములకు మాత్రమే ఉండేవి. చాకలి ఐలమ్మ పోరాటంతో స్ఫూ్ర్తి పొంది ఇందిరాగాంధీ పేదలుకు లక్షల ఎకరాల భూమి ఇచ్చారు. చాకలి ఐలమ్మ సాయుధ రైతాంగ పోరాటం నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించనుంది. చరిత్రలో కొంతమంది ఎప్పటికీ గొప్పగా ఉండాలని భావిస్తున్నాం. ఐఐహెచ్‌టీని హైదరాబాద్ లో ప్రారంభించాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి వారిని గౌరవించుకున్నాం. కొందరికి మాత్రమే వెళ్లేందుకు అవకాశం ఉన్న ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చాం. ప్రజా పాలన తీసుకొచ్చి మహాత్మా జ్యోతిరావు ఫూలే పేరును ప్రజా భవన్ కు పెట్టి సార్థం చేసుకున్నాం. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని కంచె ఐలయ్య సూచించారు. ప్రజల నుంచి వస్తున్న సూచన మేరకు కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీగా నామకరణం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.
Also Read: రాష్ట్రాల వాటా 50 శాతానికి పెంచండి- 16వ ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి