Siddipet News: సమాజంలో ఇప్పుడు సైబర్ క్రైమ్ అనేది పెద్ద సమస్యగా మారిన సంగతి తెలిసిందే. పోలీసులు ఎన్ని మార్గాల్లో అవగాహన కల్పించినప్పటికీ ఇంకా బాధితులు రోజురోజుకు వస్తూనే ఉన్నారు. సైబర్ క్రైమ్ నేరాల బారిన పడి ఎంతో నష్టపోతున్నారు. మరోవైపు జనాల అత్యాశను తమకు అనుకులంగా మార్చుకుని మోసాలతో కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. దీంతో సైబర్ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం పోలీసులు చాలా శ్రమించాల్సి వస్తోంది.             

  


సోషల్ మీడియాలో కూడా పోలీసులు తమదైన శైలిలో అవగాహన కల్పిస్తున్నారు. అయితే, పెద్ద పెద్ద పట్టణాలకే పరిమితం కాకుండా గ్రామాల్లో కూడా సైబర్‌ మోసాల బారిన పడుతున్న వారు ఉన్నారు. అందుకని వినాయక చవితి సందర్భంగా కొంత మంది యువకులు వినాయకుడ్ని సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేలా తయారు చేశారు. మొత్తం గణేష్ మండపాన్ని సైబర్ క్రైమ్ థీమ్‌తో తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. వినాయకుడి మండపం డెకరేషన్ లో భాగంగా ఫ్లెక్సీపై సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలను ఫొటోల రూపంలో ఉంచారు.




అయితే, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవడంతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. గణేష్ మండపాన్ని సైబర్ క్రైమ్ థీమ్‌తో తయారు చేయడాన్ని సజ్జనార్ మెచ్చుకున్నారు. వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ ఇలా గణేష్ మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం అని కొనియాడారు. భక్తి భావంతో పాటు సమాజంలో ఇలాంటి అవగాహన తేవడం ఎంతో ముఖ్యమని సజ్జనార్ అభిప్రాయపడ్డారు. సైబర్ నేరాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయని.. అమాయకులను మాయమాటలతో మోసగాళ్ళు కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారని గుర్తు చేశారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సజ్జనార్ సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.           


Also Read: హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్


‘‘సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ వినూత్న ఆలోచనతో యువ కిరణం స్పోర్ట్స్ అసోసియేషన్ వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయం. భక్తి భావంతో పాటు సమాజం హితం ఎంతో ముఖ్యమని ఈ అసోసియేషన్ గుర్తించడం గొప్ప విషయం. సైబర్ నేరాలు రోజురోజుకీ పెట్రేగిపోతున్నాయి. అమాయకులను మాయమాటలతో మోసగాళ్ళు కోట్లల్లో కుచ్చుటోపి పెడుతున్నారు. సమాజం పట్ల బాధ్యతతో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని సజ్జనార్ అన్నారు.