చిత్తశుద్దితో, గట్టిసంకల్పంతో కార్యాన్ని ప్రారంభించినప్పుడు గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సందర్భాల్లో కొంచెం ఆలస్యం అవుతుండవచ్చు గానీ గమ్యాన్ని చేరుకోవడం మాత్రం ఖాయం అన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యమని తెలిపారు. అల్లా కే ఘర్  దేర్ హై లేకిన్ అంధేర్ నహీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. దావత్‌లో పాల్గొనేందుకు ఎల్బీ స్టేడియానికి చేరుకున్న సీఎం కేసీఆర్ తొలుత అనాథ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు, వారి చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలతో ఇంగ్లీషులో మాట్లాడారు. వారి ఆంగ్ల భాషా పరిజ్జానాన్ని చూసి సీఎం ముచ్చటపడ్డారు. ఇంకా గొప్పగా చదవి ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు. వారితో చేయి చేయి కలిపి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, బాక్సింగ్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ తదితరులు పాల్గొన్నారు. 


సభా వేదికపై ముఖ్యమంత్రికి స్వాగతం పలికి, జ్ఞాపికతో పాటు భారతదేశ పటంలో  సీఎం కేసీఆర్ ఉన్న ఫోటోను బహుకరించారు. అనంతరం ముస్లిం మతపెద్దల వద్దకు వెళ్లి వారిని పేరు పేరునా పలకరించి అభివాదాలు తెలిపారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రసంగంతో సభ ప్రారంభం అయింది. అనంతరం మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగించారు. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సందేశాన్ని అందించారు.


 సీఎం కేసీఆర్ ప్రసంగం- ఆయన మాటల్లోనే..


పెద్దలకు, ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు. ప్రతీ యేడు లాగే ఈ సంవత్సరం కూడా ఇఫ్తార్ విందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మీరందరి రాకతో ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. మీ అందరికీ ధన్యవాదాలు. తొమ్మిది పదేళ్ళ క్రితం మనల్ని వెనుకబడినవారిగా పరిగణించేవారు. కానీ నేడు అల్లా దయతో, మీ అందరి ప్రార్థనలతో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోనే పోటీ అనేది లేదు. ఇది నేను చెప్తున్నది కాదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోనే మరే రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలకంటే ముందంజలో ఉంది. పరిశ్రమలు, ఐటి రంగంలో పురోగమిస్తున్న తీరును అందరూ గమనిస్తూనే ఉన్నారు.


అసదుద్దీన్ ఒవైసీ తదితరులు కోరిన మేరకు అనీస్ ఉల్ గుర్బా ను అత్యద్భుతంగా నిర్మించుకున్నాం. BRS కు పూర్వం ఈ ప్రాంతాన్ని10  సంవత్సరాలపాటు కాంగ్రెస్ పాలించింది. ఈ పదేళ్ల కాలంలో వారు ముస్లింల కోసం దాదాపు 1200 కోట్ల రూపాయలను మాత్రమే ఖర్చు చేశారు. కానీ బిఆర్ఎస్ రూ. 12వేల కోట్లు ముస్లింల సంక్షేమం, అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇవి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వెలువరించిన గణాంకాలు. అసెంబ్లీ, సెక్రటేరియట్ తో పాటు మైనార్టీ వెల్ఫేర్ సైట్ లో ఈ వివరాలను చూడవచ్చు.


వరి పండించడంలో మనమే టాప్- సీఎం కేసీఆర్


గతంలో లాగా రైతుల ఆత్మహత్యలు ఇప్పుడు లేవు. జీవన పోరాటంలో భాగంగా బయటి రాష్ట్రాలకు వెళ్ళిన రైతులు నేడు వారి వారి ఊళ్లకు తిరిగి వచ్చారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో 94 లక్షల ఎకరాల్లో వరి పంటను పండించుకున్నామని నేను గర్వంతో చెప్తున్నాను. మొత్తం దేశంలో సాగుచేసిన 66 లక్షల ఎకరాల వరి సాగు విస్తీర్ణం కంటే ఒక్క తెలంగాణలోనే పండించిన వరి సాగు విస్తీర్ణం చాలా ఎక్కువ. త్రాగునీరు, కరెంటు సమస్యలు నేడు లేవు. నిరుద్యోగ సమస్యను కూడా మెల్లమెల్లగా తొలగించుకుంటున్నాం. మనం ముందుకు సాగుతున్నాం కానీ, దేశం వెనుకబడిపోతున్నది. ఈ విషయాన్ని చెప్పేందుకు నేను ఇబ్బంది పడటం లేదు.కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం తీరుగా శ్రమిస్తే  దేశ జిడిపి కనీసం మరో 3 లక్షల నుంచి 4 లక్షలు పెరిగేది. ఈ విషయంలో మనం దెబ్బతిన్నాం.


దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది- సీఎం కేసీఆర్


ఈ రోజు దేశం అగమ్యగోచర స్థితిలో పయనిస్తున్నది. ఈ విషయం మనందరికీ తెలుసు. భారతదేశం మనందరిదీ. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం మన దేశాన్ని కాపాడుకోవాలని నేను పెద్దలను, యువతను కోరుతున్నాను. చిన్నచిన్న కష్టాలు వస్తూనే ఉంటాయి. మీ సహకారం ఉంటే చివరి వరకు పోరాడుతూనే ఉందాం. ఇది తాత్కాలిక దశ. ఈ సమయంలో ఒనగూరేదేం ఉండదు. తుదకు న్యాయమే గెలుస్తుంది. దేవుని వద్ద ఆలస్యం కావచ్చు కానీ చేరుకోవడం తథ్యం (అల్లా కే ఘర్ మే దేర్ హే లేకిన్ అంధేర్ నహీ హే). తెలంగాణ కోసం పోరాడినట్లుగానే ఉజ్వల భారతదేశం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి లక్ష్యం చేరుకోవడం తథ్యం. ఈ దేశం మనందరిది. మనం ముందుకు సాగుదాం. ఈ దేశాన్ని సురక్షితంగా కాపాడుకుందాం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుదాం. కానీ రాజీపడే ప్రసక్తే లేదు.


మన సంస్కృతిని ఎవరూ మార్చలేరు- సీఎం కేసీఆర్


ఈ దేశ గంగా జమున సంస్కృతిని, ఆచార, సాంప్రదాయాలను ఎవరూ మార్చలేరు. అలా ప్రయత్నించిన వారు అంతమవుతారు. కానీ దేశం ఎన్నటికీ నిలిచే ఉంటుంది.  నా మాటల పై నమ్మకం ఉంచండి. సమయం వచ్చినప్పుడు దేశాన్ని రక్షించుకోవడానికి శక్తిని కాకుండా యుక్తిని ప్రయోగించాలి. దేశాన్ని రక్షించుకోవాలని నేను మీకు విన్నవిస్తున్నాను. ప్రస్తుతమున్న దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకు నేను దేశ రాజకీయాల్లోకి ప్రవేశించాను. మహారాష్ట్ర ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. నా అంచనాలకు మించి ప్రజాదారణ లభిస్తున్నది. ఈ దేశం సరైన నాయకునికి కోసం, పార్టీ కోసం వేచి చూస్తున్నదనేది స్పష్టమైంది.ఈ దేశాన్ని రక్షించుకునేందుకు మేం శాయశక్తుల కృషి చేస్తాం. యావత్ ముస్లిం సమాజానికి హృదయపూర్వకంగా మరోమారు రంజాన్ మాసపు శుభాకాంక్షలు అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.


 రోజా (ఉపవాస దీక్ష) విడిచే సమయానికి సీఎం ప్రసంగం ముగిసింది. అజాన్ పిలుపు తర్వాత ఇస్లాం సాంప్రదాయం పద్దతిని అనుసరించి తనతో పాటు కూర్చున్న పలువురికి కేసీఆర్ ఉపవాసాన్ని విరమింపజేశారు. అనంతరం వారితో కలిసి విందులో పాల్గొన్నారు.