Delhi CM Kejriwal meet KCR in Hyderabad: హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ తో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం  ప్రగతి భవన్ లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లతో కేసీఆర్ ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం ముప్పు తిప్పలు పెడుతోందని కేసీఆర్ ఆరోపించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో కేంద్ర బీజేపీ బీజేపీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. ఎమర్జెన్సీపై బీజేపీ నేతలకు విమర్శించే నైతిక హక్కులేదని, ఇప్పుడు వారి తీరు అలాగే ఉందన్నారు. లోక్ సభలో, రాజ్యసభలో తమ శక్తిని ఉపయోగించి.. కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకునేలా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అరవింద్ కేజ్రీవాల్ కు తమ మద్దతు ఉంటుందన్నారు.


ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత ఘటనలు చూశాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ఎంత పాపులర్ అనేది దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తెలుసునన్నారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో సోషల్ ఉద్యమంతో వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP). కేజ్రీవాల్ నాయకత్వంలో అప్రతిహతంగా మూడు పర్యాయాలు ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు కేసీఆర్. కానీ కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ స్పష్టమైన మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఒకటిగా ఉన్నదాన్ని మూడుగా చేసినా, కేంద్రం కుయుక్తులు చేసినా బీజేపీని తిరస్కరించిన ప్రజలు ఆప్ ను గెలిపించారు. మేయర్ ను ప్రమాణస్వీకారం చేయకుండా కేంద్రం అడ్డుకుందని మండిపడ్డారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటే కానీ మేయర్ ను ప్రమాణ స్వీకారం చేయించే పరిస్థితి లేదన్నారు.


8


రెండు జాతీయ పార్టీలను మట్టి కరిపించి భారీ మెజార్టీతో అరవింద్ కేజ్రీవాల్ మూడు సార్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. అనుకున్నట్లుగానే భారీ మెజార్టీతో ఆప్ విజయం సాధిస్తే ఓర్చుకోలేని కేంద్ర ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ ను వీళ్ల నెత్తిమీద పెట్టి కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుందని కేంద్రాన్ని విమర్శించారు. సుప్రీంకోర్టును ఆప్ ఆశ్రయిస్తే.. 5 సభ్యుల ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం కిందనే అధికారులు పనిచేయాలని ఆదేశించింది. గెలిచిన ప్రభుత్వాన్ని పనిచేయకుండా అడ్డుకోవడమే అరాచకం అంటే, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకుండా ఆర్డినెన్స్ లు తీసుకొస్తున్న కేంద్రం తీరు చూస్తే ఎమర్జెన్సీ రోజులు గుర్తుకొస్తున్నాయని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: హైదరాబాద్‌లో కేసీఆర్‌తో కేజ్రీవాల్‌ చర్చలు, కేంద్రంపై పోరాాటానికి మద్దతివ్వాలని రిక్వస్ట్


గతంలో కాంగ్రెస్ హయాంలో ప్రధాని ఇందిరా గాంధీ అమ‌లు చేసిన ఎమ‌ర్జెన్సీ తరహాలో ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని కేసీఆర్ ఆరోపించారు. వరుసగా మూడు ఎన్నికల్లో బీజేపీ సహా జాతీయ పార్టీలను ప్రజలు తిరస్కరించారని కేసీఆర్ గుర్తుచేశారు. ఆ మూడు ఎన్నికల్లోనూ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్న  బీజేపీకి ఢిల్లీ ప్రజ‌లు మ‌రోసారి త‌గిన బుద్ధి చెబుతారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఇకనైనా తమ ఆలోచనను మార్చుకుని, ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు.