KCR pays tribute to last Nizam Of Hyderabad Mukarram Jah: హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకర్రం ఝా పార్థీవదేహం టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి హైదరాబాద్ కు చేరుకుంది. అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌లో సందర్శకుల కోసం చివరి నిజాం ముకర్రం ఝా పార్థీవదేహాన్ని మంగళవారం సాయంత్రం ఉంచారు. హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం కేసీఆర్ అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం కేసీఆర్ ఓదార్చారు. ముఖ్యమంత్రి వెంట హోం మంత్రి మహమూద్ అలీ, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎ. జీవన్ రెడ్డి, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ ఈ. ఆంజనేయ గౌడ్, వక్ఫ్ బోర్డ్ మాజీ ఛైర్మన్ మహ్మద్ సలీం తదితరులు ఉన్నారు. డీజీపీ అంజనీకుమార్ సైతం ముకరం ఝాకు నివాళులర్పించారు.
టర్కీలో కన్నుమూసిన హైదరాబాద్ చివరి నిజాం నవాబు
హైదరాబాద్ చివరి నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో శనివారం రాత్రి ముకరం ఝా తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ ఎనిమిదో నిజాం అయిన ముకరం ఝా చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో అసఫ్ జాహీ టూంబ్స్‌లో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ముకరం ఝా పార్ధివదేహాన్ని జనవరి 17న టర్కీ నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు. ముకరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమహల్లా ప్యాలెస్‌లో ఉంచారు.
మక్కా మసీద్‌లో అంత్యక్రియలు
ఆయన చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లోని మక్కా మసీద్‌లో ఖననం చేసేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం (జనవరి 18) ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముకర్రం ఝా పార్థీవ దేహాన్ని చూసేందుకు అనుమతి ఇచ్చారు. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు ముకర్రం ఝా అంతిమయాత్ర ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
ముకరం ఝా మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
హైదరాబాద్ 8వ నిజాం ముకర్రమ్ ఝా (Mukarram Jah) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు సిఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. నిజాం వారసుడుగా, పేదల కోసం విద్యా వైద్య రంగాల్లో ముకర్రమ్ ఝా చేసిన సామాజిక సేవలకు గుర్తుగా, వారి అంత్యక్రియలను అత్యున్నతస్థాయి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ఆదేశించారు.
హైదరాబాద్ సంస్థానం ఆఖరి నిజాం ‘మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్’ మనుమడు, నిజాం పెద్దకొడుకు ఆజమ్ ఝా, దుర్రె షెహవార్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రమ్ ఝా (Mukarram Jah) జన్మించారు. ప్రిన్సెస్ దుర్రె షెహవార్ టర్కీ ఒట్టోమన్ సామ్రాజ్యం చివరి సుల్తాన్ కుమార్తె. తాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారసుడిగా ముకర్రం ఝాను 1954 జూన్ 14న ప్రకటించారు. అప్పటినుంచి 1971 వరకు ముకర్రం ఝా హైదరాబాద్ 8వ నిజాంగా ఉన్నారు.