పోరాటాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ఇప్పుడు అభివృద్ధితోనూ ఆకట్టుకుందన్నారు గవర్నర్ తమిళిసై ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం రంగాల్లో అగ్రగామిగా నిలిచిన... అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ దూసుకెళ్తోందన్నారు గవర్నర్ తమిళిసై. 


పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారిన సందర్భంలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఆనంద పడాలని అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి తొమ్మిదో ఏడాదిలోకి అడుగుపెట్టిన వేళ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణను అదే స్పూర్తితో అభివృద్ధి చేసుకున్నామన్నా8రు. 


దేశానికి తెలంగాణ పాఠాలు: కేసీఆర్


వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు, విద్య, వైద్యం అన్ని రంగాల్లో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధి నమోదు చేస్తుందన్నారు కేసీఆర్. దీన్ని కేంద్రంతోపాటు జాతీయ అంతర్జాతీయ సంస్థలు గుర్తించి ప్రశంసలు అందిస్తున్నాయని తెలిపారు. ఎనిమిదేళ్లలో ఎవరూ ఊహించని పథకాలు తీసుకొచ్చి ప్రజల సంక్షేమానికి రాష్త్ర అభివృద్ధిని పరుగుల పెట్టించామన్నారు. పరిశ్రమలు మౌలిక వసతుల కల్పన, వ్యాపార, వాణిజ్యంలో దేశానికే నేడు తెలంగాణ పాఠాలు నేర్పే స్థాయికి వచ్చిందని వివరించారు. 


కేంద్రం విపక్ష చూపిస్తున్నా...: కేసీఆర్


పారదర్శకత, క్రమశిక్షమతో రాష్ట్రాన్ని పునర్‌నిర్మించుకున్నామన్నారు కేసీఆర్. ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న కఠిన నిర్ణయాలు, వాటిని అమలు చేస్తున్న అధికారులు, ఏ నిర్ణయం తీసుకున్న సహకరిస్తున్న ప్రజలంతా ఈ అభివృద్ధిలో భాగమేనన్నారు. అందరి సహకారంతోనే ఇంతటి ఘనవిజయం సాధ్యమైందని అభిప్రాయపడ్డారు కేసీఆర్. ఇలాంటి టైంలో ప్రోత్సహించాల్సిన కేంద్రం వివక్ష చూపిస్తున్నా... వెనకడుగు వేయకుండా బంగారు తెంగాణ దిశగా సాగుతున్నామన్నామని చెప్పారు సీఎం కేసీఆర్. 


చాలా ఆనందంగా ఉంది: కేటీఆర్


జూన్ 2, 2014న రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన ప్రగతిని చూడటం చాలా సంతృప్తికరంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైనందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున తెలంగాణను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు పునరంకితమవుదామని ట్వీట్ చేశారు. 






అదే నా స్వప్నం: రేవంత్ రెడ్డి


తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి కూడా ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రైతుల ఆత్మహత్యలు లేని, యువత ఉపాధికి కొదువలేని… ప్రతి విద్యార్థికి చదువు… ప్రతి అవ్వ,అయ్యకు పెన్షన్… ప్రతి ఆడబిడ్డకు భద్రత… ప్రతి పేదవాడి మొహాన చిరునవ్వు చూసే తెలంగాణ తన స్వప్నమంటూ వివరించుకొచ్చారు రేవంత్.






తెలంగాణ లక్షణాన్ని దేశం ఆదర్శంగా తీసుకోవాలి: పవన్


పాలకుల అణచివేతను ఎదురించి పోరాడటం తెలంగాణ నేల సొంతమని దాన్ని దేశంలోని ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత  పవన్ కల్యాణ్. తెలంగాణ బిడ్డలు ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకున్నారో ఆ లక్ష్యం సిద్ధించాలని కోరుకుంటూ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.