Telangana Cabinet Meeting: డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ కేబినేట్ భేటీ కానుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగనున్నది. రైతులు పండించిన ధాన్యం కొనుగోల్లు, రైతుబంధు నిధుల విడుదల, సొంత జాగా ఉన్న బలహీన వర్గాలకు గృహ నిర్మాణంపై ప్రభుత్వం అందించే సాయం, దళిత బంధు అమలు, తదితర అంశాలపై తెలంగాణ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.


ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు.. 
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడాది మాత్రమే గడువు ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ సహా అధికార టీఆర్ఎస్ పార్టీలు విమర్శల స్థాయిని పెంచేశాయి. మరోవైపు ఈడీ, ఐటీ, సీబీఐ తనిఖీలతో నేతలు సతమతమవుతున్నారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వరుసగా ఈడీ, సీబీఐ నోటీసులు ఇవ్వడం, ఆకస్మిక దాడులు చేయడం జరుగుతున్నాయి. గత వారం సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబధించి ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయంపై తలమునకలైన సమయంలో తెలంగాణ కేబినెట్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. 


ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్లపై సర్కార్ ఫోకస్.. 
ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుందని తెలుస్తోంది. నిరుద్యోగులు, యువత విషయంపై ఫోకస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే పోలీస్ పోస్టులైన కానిస్టేబుల్, ఎస్ పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలు విడుదల చేసి, ఈవెంట్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. గ్రూప్ 1 పరీక్షకు ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించి, కీ సైతం టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. త్వరలోనే మెయిన్స్ కు అర్హుల జాబితా విడుదల చేయనున్నారు. గ్రూప్ 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పై కసరత్తు జరుగుతోంది. గ్రూప్ 2, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 






డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పంపకం వేగం పెంచడంతో పాటు సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణం కోసం రూ.3 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయనుంది. ఇటీవల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 1000 ఇళ్లను కేటాయించి, అర్హులైన పేదలకు ప్రభుత్వం ఇంటి నిర్మాణం కోసం ఆర్థిక సాయం అందించనుంది. ఇదే నెలలో లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించనున్నారు.