Bansilalpet Stepwell : హైదరాబాద్ లోని బన్సీలాల్ పేట్ మెట్ల బావిని మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పూర్వపు వైభ‌వాన్ని క‌ళ్లకు క‌ట్టేలా బావిని పునరుద్ధరించారు. బన్సీలాల్ పేట్ మెట్ల బావిని 3 శతాబ్దాల క్రితం నిర్మించారు. స‌హిత స్వచ్ఛంద సంస్థ స‌హ‌కారంతో ఈ బావిని జీహెచ్ఎంసీ సుందరంగా తీర్చిదిద్దింది. పురాత‌నమైన బావికి మ‌ర‌మ్మతులు చేసి ఆధునీక‌రించారు. నాటి చ‌రిత్రను నేటి త‌రాల‌కు తెలిసేలా చేసేందుకు మెట్ల బావిని పునరుద్ధరించారు.  



నిజాం రాజుల కాలం నాటి బావి 


17వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన బావిని పునరుద్దరించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇందులో భాగంగా బన్సీలాల్ పేటలోని పురాతన బావి పునరుద్ధరణ పనులను మంత్రి తలసాని, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీకి అప్పగించారు. మంత్రి తలసాని బావి ఆధునీకరణ పనులను పర్యవేక్షించారు. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేటలో ఉన్న ఈ బావి కొన్ని శతాబ్దాల పాటు సేవలందించింది. ఆ తర్వాత నిరాదరణకు గురై రూపు రేఖలు కోల్పోయింది. ఈ  మెట్లబావి తెలంగాణ సర్కారు చొరవతో మళ్లీ పునర్జీవం పోసుకుంది. పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుతుంది. నిజాం రాజులు తాగునీటి కోసం బన్సీలాల్‌పేట మెట్ల బావిని ఉపయోగించారు. రాష్ట్ర ప్రభుత్వం, రెయిన్‌ వాటర్‌ ప్రాజెక్ట్‌ చొరవతో మెట్ల బావి పునర్జీవం పోసుకుంది. ఈ బావి సామర్థ్యం 22 లక్షల లీటర్లుగా ఉంది. అయితే ఈ బావి స్పెషాలిటీ ఏంటంటే నీళ్లు ఎంత కిందికి వెళ్లినా మెట్ల ద్వారా కిందకు దిగి నీళ్లు తోడుకోవచ్చు. కాలక్రమేణా వాడకంలేకపోడవంతో చెత్తా చెదారం చేరి మట్టితో పూడుకుపోయింది. బన్సిలాల్‌పేట మెట్ల బావిలో పూడిక తీసినప్పుడు చెత్తా, చెదారంతో పాటు మట్టీ, పురాతన వస్తువులు బయటపడ్డాయని అధికారులు చెప్పారు. 50 అడుగుల లోతు ఉన్న ఈ బావిలో నీరు నిరంతరం ఊరుతుంటాయి.   


చారిత్రక ప్రదేశాలకు పునర్జీవం 


శతాబ్దాల చరిత్ర ఉన్న మెట్ల బావులు ఇటీవల నిరాదరణకు గురైయ్యాయి. వాటి రూపురేఖలు కోల్పోయాయి. ఇలాంటి చారిత్రక ప్రదేశాల పునరుద్ధరణకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటున్నది. హైదరాబాద్‌ చారిత్రక వైభవానికి ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పునరుద్ధరించే క్రమంలో మెట్ల బావుల పరిరక్షణకు కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్‌ఎండీఏ చొరవతో బన్సీలాల్‌పేట మెట్ల బావి మళ్లీ జీవం పోసుకుంది. చెత్తా చెదారంతో పూడుకుపోయిన ఈ బావి పునరుద్ధరణ పనులను గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభించారు. సుమారు 500 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలను బావి నుంచి తొలగించారు. ఇప్పుడు విద్యుత్ వెలుగులతో కండ్లు చెదిరేలా హంగులు అద్దారు. విద్యుద్దీపాలు అలంకరించి ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వీలుగా థియేటర్‌, పూడికతీతలో లభ్యమైన వివిధ వస్తువుల ప్రదర్శన కోసం గ్యాలరీ, ఒక గార్డెన్‌ను ఏర్పాటు చేశారు.