- భారత గణతంత్ర వేడుకలను నాలుగు గోడల మధ్య నిర్వహించాలనుకుంటారా?
- పరేడ్ లేకపోవడమంటే సైనికులను, పోలీసులను, విద్యార్థులను అవమానించడమే
- కోర్టులు మెట్టికాయ వేస్తే కేసీఆర్ వినే పరిస్థితి లేదు
- సీఎం, మంత్రుల సభలకు అడ్డరాని కోవిడ్ రూల్స్ గణతంత్ర వేడుకలకే వచ్చాయా?
- బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు ఆగ్రహం
భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను నాలుగు గోడల మధ్యే పరిమితం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రామచంద్రరావు మండిపడ్డారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నియంతలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కోర్టులు మెట్టికాయలు వేస్తే కేసీఆర్ వినే పరిస్థితి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఈ మేరకు రామచంద్రరావు బుధవారం హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు.
జాతీయ భావాలను ప్రజల్లో నింపే ఉద్దేశంతో అత్యంత ఘనంగా పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు బీజేపీ నేత రామచంద్రరావు. పరేడ్ ద్వారా సైనికుల, పోలీసుల ధైర్య సాహసాలు ప్రజలు తెలుసుకునే అవకాశముందన్నారు. అట్లాగే వివిధ సంస్క్రుతి, సాంప్రదాయాలకు అద్దంపట్టేలా వివిధ కళారూపాలు, విద్యార్థుల నైపుణ్య ప్రదర్శనలు ఈ వేడుకల్లో ప్రతిబింబిస్తాయన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ వేడుకలను రాజ్ భవన్ కే పరిమితం చేయాలని కేసీఆర్ నిర్ణయించడం సిగ్గు చేటన్నారు.
రాష్ట్ర హైకోర్టు ఆదేశిస్తే తప్ప సీఎం కేసీఆర్ వినే పరిస్థితి లేకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరపడం కేసీఆర్ ప్రభుత్వానికి ఇష్టంలేదనే విషయం బయటపడిందన్నారు. కోవిడ్ సాకుతో పరేడ్ మైదానంలో వేడుకలు నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలను పిలిచి ఖమ్మంలో భారీ బహిరంగ సభలు పెట్టడానికి కోవిడ్ అడ్డరాలేదా? హైదరాబాద్ ప్రజలు చూడటానికి, జాతీయ భావాలు నింపేందుకు దోహదపడే గణతంత్ర వేడుకల నిర్వహణకు మాత్రమే కోవిడ్ నిబంధనలు అడ్డుపడ్డాయా? ఇదేం వివక్ష? అని సీఎం కేసీఆర్‌ను బీజేపీ నేత రామచందర్ రావు ప్రశ్నించారు.
హైకోర్టు తీర్పు కేసీఆర్‌కు చెంపదెబ్బ లాంటిదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవాలని, నిబంధనలను పాటించాలని కోర్టు ప్రభుత్వానికి చెప్పాల్సిన పరిస్థితులు తలెత్తాయన్నారు. ప్రజాస్వామ్య పద్ధతులను, రాజ్యాంగాన్ని కించపరచడానికి కేసీఆర్ ఎంతవరకైనా వెళ్లే వ్యక్తి అన్నారు. ఇప్పటికైనా గవర్నర్ తమిళిసైకి, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ ట్వీట్ చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకలపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఈటల రాజేందర్ స్పందించారు. హైకోర్టు ఉత్తర్వులు వెంటనే అమలు జరపాలి.
గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలన్నారు. ఇక్కడ చట్టం రాజ్యాంగం ఉంది అని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు. ఏ రాజ్యాంగం అధికారం ఇచ్చిందో అదే రాజ్యాంగాన్ని, చట్టాన్ని పట్టించుకోను అంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదన్నారు. వ్యవస్థ మనకంటే చాలా పెద్దదని గుర్తుంచోవాలని.. అన్ని వ్యవస్థలను, సంప్రదాయాలని తుంగలో తొక్కడం సబబు కాదని సూచించారు.