Republic Day Celebrations 2023: గణతంత్ర దినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) పరేడ్ గ్రౌండ్‌లో అధికారికంగా జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం జరపకపోవడంపై గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) అసహనం వ్యక్తం చేశారు. రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర వేడుకలు నిర్వహించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ రాసిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా వేడుకలు జరపడం లేదని లేఖలో కారణంగా చెప్పారు. అయితే, ప్రభుత్వ ఈ నిర్ణయంపై గవర్నర్‌ తమిళిసై ఆవేదన చెందారు. కొవిడ్‌ పేరుతో వేడుకలు జరపకపోవడం సరికాదని అన్నారు. ఈ విషయాన్ని తాను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని తమిళిసై తెలిపారు. 


కొవిడ్‌ కారణంగా గత ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆ సమయంలో కరోనా మూడో వేవ్ మొదలు అవుతోంది. గణతంత్ర వేడుకల నిర్వహణ విషయమై అప్పట్లో రాజ్ భవన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదం జరిగింది. గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తప్పు పట్టిన గవర్నర్ ప్రసంగం కూడా పంపలేదని పేర్కొన్నారు. అయితే కొవిడ్‌ ఉద్ధృతి కారణంగా రాజ్‌ భవన్‌లోనే గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.


ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించింది. ఆ సభకు మూడు రాష్ట్రాల సీఎంలు సహా జాతీయ నేతలు హాజరు అయ్యారు. లక్షల్లో జనం వచ్చారు. అయితే, ఆ సభకు రాని కొవిడ్ నిబంధనల అడ్డు గణతంత్ర వేడుకలు నిర్వహించడానికి వచ్చాయా? అని గవర్నర్ తమిళిసై వాపోయారు. గవర్నర్ పట్ల తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి తాను కేంద్రానికి వివరిస్తానని తమిళిసై వివరించారు.


జనవరి 26న గవర్నర్ తమిళిసై రాజ్ భవన్‌లోనే జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సొంత ఖర్చులతో ప్రత్యేక విమానంలో పుదుచ్చేరికి వెళ్లనున్నారు. అక్కడ జరిగే గణతంత్ర వేడుకల్లో కూడా తమిళిసై పాల్గొననున్నారు. పుదుచ్చేరికి కూడా తమిళిసై లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న సంగతి తెలిసిందే.


అప్పటి నుంచి మరింత పెరిగిన విభేదాలు


కేసీఆర్‌కు, గవర్నర్‌ తమిళిసైల మధ్య పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్‌ కోటా కింద ఎమ్మెల్సీగా ప్రతిపాదించినప్పటి నుంచి విభేదాలు మొదలయ్యాయి. సీఎంవో పంపిన ఫైలును గవర్నర్‌ పక్కన పెట్టడం ఈ విభేదాలు మొదలయ్యేందుకు కారణం అయింది. రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలకు సీఎం, మంత్రులు హాజరు కాలేదు. సమతామూర్తి విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రపతిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి ఇద్దరూ వచ్చినా దూరంగానే ఉన్నారు. రాజ్ భవన్​లో గవర్నర్ జెండాను ఆవిష్కరించే సమయంలో సీఎం కేసీఆర్ ఉండాలి.. కానీ వేడుకలకు సీఎం హాజరుకాలేదు. ఆ తర్వాత తమిళిసై తెలంగాణలో ఏ పర్యటనకు వెళ్లినా ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన కలెక్టర్ ఆ రోజు సెలవులో ఉండడం, ప్రభుత్వం హెలికాప్టర్ సదుపాయం కల్పించకపోవడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి. గత వరదల సందర్భంగా గవర్నర్ భద్రాచలానికి రైలులో ప్రయాణించడం కూడా అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది.