సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేటలోని ఇటీవల సంభవించిన భారీ అగ్ని ప్రమాద ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న డెక్కన్‌ మాల్ భవనం కూల్చివేత విషయంలో సందిగ్ధత వీడింది. భవనంలోని స్టోర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఆ కట్టడం మొత్తాన్ని కూల్చివేసేందుకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి అధికారులు టెండర్లను ఆహ్వానించారు. మొత్తం 1,890 చదరపు అడుగుల్లో ఉన్న వాణిజ్య భవనం కూల్చివేతకు రూ.38.86లక్షలతో టెండర్లను జీహెచ్‌ఎంసీ ఆహ్వానించింది.


అధునాతన యంత్రాలతో కూల్చివేయడానికి కాంట్రాక్టు ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ఒక్కరోజు గడువుతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి బిడ్‌ డాక్యుమెంట్‌ డౌన్‌లోడ్‌కు అవకాశమిచ్చింది. బుధవారం 10.30 గంటల వరకు దాఖలుకు గడువు ఇచ్చింది. గడువు ముగియగానే టెండర్లు ఓపెన్‌ చేసి ఏజెన్సీని ఫైనల్ చేయనున్నారు.


టెండర్‌ దాఖలుకు ఎంపికైన ఏజెన్సీకి లెటర్‌ ఆఫ్‌ యాక్సెప్టెన్స్‌ (ఎల్‌ఓఏ) ఇచ్చాక నాలుగు గంటల్లో కూల్చివేత ప్రక్రియ ఉండనుంది. కూల్చివేతకు అవసరమైన యంత్రాలు, పరికరాల తరలింపు పనులు చేపట్టాలని అధికారులు తెలిపారు. పోలీసు, రెవెన్యూ అధికారుల నుంచి క్లియరెన్స్‌ వచ్చాక.. ఆర్‌సీసీ శ్లాబులు, బీమ్స్, కాలమ్స్, మిషనరీ వాల్వ్‌లు, తలుపులు, షట్టర్లు, ర్యాక్స్, కిటికీలు, వెంటలేటిర్లతో పాటు ఇతరత్రా మొత్తం భవనాన్ని కూల్చాలని టెండరు నిబంధనల్లో పేర్కొన్నారు. పోలీసు, ఫైర్, ఈవీడీఎం అధికారుల సమన్వయంతో భవనాన్ని కూల్చనున్నారు.


అన్ని బాధ్యతలు కాంట్రాక్టు ఏజెన్సీవే
కూల్చివేతకు అవసరమైన యంత్రాలు, పరికరాలు, సేఫ్టీ సామగ్రి అన్నీ కాంట్రాక్టు ఏజెన్సీనే తెచ్చుకోవాల్సి ఉంటుంది. కూల్చివేత సందర్భంగా మళ్లీ ఏదైనా ప్రమాదం జరిగితే కాంట్రాక్టు చట్టాల ప్రకారం.. ఆ నష్ట పరిహార బాధ్యత కూడా ఏజెన్సీకే ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పారు. చుట్టుపక్కల ప్రజలకు నష్టం కలగకుండా, దుమ్ము, శబ్దం తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని తెలిపింది. కూల్చాల్సిన భవనానికి కరెంటు, వాటర్, శానిటరీ కనెక్షన్లను తొలగించాలని పేర్కొంది. వ్యర్థ పదార్థాలను కూడా ఏజెన్సీయే రీసైక్లింగ్‌ ప్లాంట్‌కు తరలించాల్సి ఉంది. ఈ పని పూర్తిచేసే కాంట్రాక్టు ఏజెన్సీకి చెల్లింపులు మిగతా కాంట్రాక్టర్ల మాదిరిగానే జీహెచ్‌ఎంసీలో నిధుల లభ్యతను బట్టి జరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. ప్రాధాన్యతతో ముందస్తుగా చెల్లించలేమని తెలిపారు.


అగ్నిప్రమాదం జరిగాక భవన పటిష్ఠతను వరంగల్‌ ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్వీ రమణారావు బృందం పరిశీలించింది. బిల్డింగ్ 70 శాతం వరకూ పటుత్వం కోల్పోయిందని, దీనిని కూల్చివేయాల్సి ఉంటుందని అదేరోజు జీహెచ్‌ఎంసీ అధికారులకు వారు తెలిపారు.