తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు 34 సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాంధీ భవన్ లో బీసీ నేతలు సమావేశమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, సురేష్ షెట్కర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, వెంకటస్వామి పాల్గొన్నారు. బీసీలకు సీట్లు కేటాయింపు అంశంపై ఏఐసీసీ పెద్దలను కలవాలని బీసీ నాయకులంతా నిర్ణయించినట్లు వెల్లడించారు. సోమవారం ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలుస్తానని మధుయాష్కీ తెలిపారు.
బీసీలకు బీఆర్ఎస్ 23 సీట్లు ఇచ్చిందన్న ఆయన, కాంగ్రెస్‌లోనూ బీసీలకు న్యాయం చేస్తామని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. ఏ యే నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారో... ఆయా సీట్లను బీసీ వర్గాలకే కేటాయించాలని పార్టీని కోరారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమన్న ఆయన, పీసీసీ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
మరోవైపు సీట్ల కోటా విషయంలోనూ తగ్గేదే లేదని కాంగ్రెస్‌లోని బీసీ లీడర్లు అంటున్నారు. తాడోపేడో తేల్చుకునేందుకూ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. హైకమాండ్‌కు లాయల్‌గా ఉంటూనే పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో లోక్‌సభ పరిధిలో రెండు సీట్లను ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. బీసీలు ఎక్కువున్నప్పుడు బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
బీసీ ఓటర్లు అధికంగా ఉండి, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు మధుయాష్కీ. తెలంగాణలో మార్పు రావాలంటే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు అవుతుందని, బహుజనుల పాత్ర ఏమిటి అని అడుగుతున్నామన్నారు. పీసీసీ చీఫ్ పని చేసిన వ్యక్తులు, సీఎల్పీ నేతలు గతంలో ఓడిపోయారని మధుయాస్కీ గుర్తు చేశారు. బీసీలకు సీట్ల కేటాయింపుపై సోనియా, రాహుల్‌ను కూడా కలుస్తామని మధుయాస్కీ తెలిపారు.