ప్రభుత్వ నిమ్స్ ఆసుపత్రి విస్తరణలో 2000 వేల బెడ్స్‌తో నూతన భవనాలు నిర్మించబోతోంది. దీనికి త్వరలోనే సీఎం కేసీఆర్ భూమి పూజ చేయబోతున్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. 


పెరుగుతున్న జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యసౌకర్యాలు పెంచాలని భావించిన ప్రభుత్వం టిమ్స్‌తోపాటు నిమ్స్‌ విస్తరణకు ప్లాన్ చేసింది. హైదరాబాద్ నలువైపులా ఒక్కొక్కటి వెయ్యి పడకల టిమ్స్ ఆసుపత్రులు నిర్మించాలని ఇప్పటికే నిర్ణయించింది. వీటితోపాటు నిమ్స్ విస్తరణకు సిఎం కేసిఆర్ త్వరలోనే శ్రీకారం చుట్టబోతున్నారు. మూడు బ్లాకుల్లో ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవలు అందించేలా నిర్మాణాలు చేపట్టనున్నారు. అన్ని విభాగాల అనుమతులు పూర్తి చేసుకొని నిర్మాణం ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు హరీష్ రావు. 


కొత్త సచివాలయంలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో తొలి సమీక్ష నిర్వహించిన హరీష్ రావు... 8 అంతస్తుల్లో నిర్మించే నూతన నిమ్స్ నిర్మాణం అందుబాటులోకి వస్తే, 1500గా ఉన్న పడకల సంఖ్య మొత్తం 3500కు చేరుతాయన్నారు. ఇటీవల భూమిపూజ చేసుకున్న సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తయితే దీని ద్వారా మరో 200 పడకలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీంతో ఒక్క నిమ్స్‌లోనే మొత్తం 3700 పడకలు అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు.


నిమ్స్ సేవలు మరింత విస్తృతం చేయడడంతోపాటు నిమ్స్ ఎంసీహెచ్ పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు హరీష్‌. గాంధీ ఆసుపత్రిలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులు ఈ నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇది ప్రారంభిస్తే దేశంలోనే తొలి సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ తెలంగాణలో ఏర్పాటు చేసినట్లవుతుందన్నారు. ఫెర్టీలిటీ సేవలు ప్రజలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు గాంధీలో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రాన్ని, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలన్నారు మంత్రి. నిమ్స్ ఆసుపత్రిలో ట్రాన్స్ ప్లాంట్ సర్జరీలు చేస్తున్నట్లుగా, గాంధీలోనూ జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ పొందేలా చూడాలన్నారు. 


కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయకపోయినా ప్రజల అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు సమీకరించి పీహెచ్సీ, బస్తీ దవాఖాన, సీహెచ్‌సీల్లో ఇప్పటికే అందుబాటులో ఉంచామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు హరీష్. కొవిడ్ సహా అన్ని రకాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల్లో తెలంగాణ నెంబర్ 1 ఉండేలా కృషి చేయాలని సంబంధిత విభాగానికి ఆదేశించారు మంత్రి.


స్టాఫ్ నర్స్ పరీక్ష ఆన్లైన్ ద్వారా.. 
వైద్యారోగ్య శాఖలో 5204 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ ప్రక్రియను ఆన్ లైన్ విధానం (CBT)లో నిర్వహించాలని మంత్రి అదేశించారు. అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇప్పటి వరకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా, పరీక్ష కోసం హైదరాబాద్‌తో పాటు, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ లో సెంట్లర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల తుది ఫలితాలు విడుదల కంటే ముందే అసిస్టెంట్ ప్రొఫెసర్ల ట్రాన్ఫర్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. రెండు వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.   


ఆదర్శప్రాయులుగా ఉండాలి...
అందరి కంటే ముందు, అందరి కంటే తర్వాత ఆసుపత్రికి వచ్చి వెళ్లే డైరెక్టర్లు, సూపరింటెండెంట్లు ఆదర్శ ప్రాయులని మంత్రి అన్నారు. ప్రతి రోజూ రెండు గంటల పాటు ఆసుపత్రుల్లో రౌండ్స్ వేస్తూ, అన్ని విభాగాలు సందర్శిస్తే మెజార్టీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశం అందరికీ దొరకదని, బాధ్యతగా పని చేసి ప్రజల మన్ననలు పొంది, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని కోరారు. ఆరోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణను నెంబర్ 1గా నిలిపేందుకు సీఎం కేసీఆర్ 12వేల కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించారని మంత్రి తెలిపారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సహా అన్ని రకాల వైద్య సిబ్బంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో కృషి చేయాలని కోరారు.