Chikoti Praveen gets bail: చీకోటి ప్రవీణ్ తో పాటు 83 మందికి బెయిల్.. నేడే హైదరాబాద్ కు!
థాయ్ లాండ్ లో చీకోటి ప్రవీణ్ కు ఊరట లభించింది. అక్కడి కోర్టు చీకోటి ప్రవీణ్ తో పాటు 83 మందికి బెయిల్ ఇచ్చింది. థాయ్ లాండ్ లోని పట్టాయలోని ఓ హోటల్‌లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తూ చీకోటి ప్రవీణ్ దొరకటం తెలిసిందే. 4500 బాట్స్ జరిమానాతో చీకోటితో పాటు ఇతర నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఫైన్ చెల్లించడంతో నిందితులకు పోలీసులు పాస్ పోర్టులు తిరిగిచ్చేశారు. దాంతో చీకోటి ప్రవీణ్ నేడు హైదరాబాద్ కు చేరుకోనున్నాడని తెలుస్తోంది.
అరెస్ట్ పై బెయిల్ అనంతరం చీకోటి ప్రవీణ్ స్పందించినట్లు అంతర్జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది. థాయ్ లాండ్ లో పోకర్ నిషేధమని తనకు తెలియదని చికోటి తెలిపారు. అక్కడ ఓ హాల్ లోకి వెళ్లిన కొంత సమయానికే పోలీసులు రైడ్ చేశారని వెల్లడించారు. తాను క్యాసినో గానీ, పోకర్ గానీ నిర్వహించలేదని, నిర్వాహకుడిని కాదని కాని చెప్పారు. పోకర్ టోర్నమెంట్ లీగల్ అని తనకు ఇద్దరి నుంచి ఆహ్వానం అందగా థాయ్ లాండ్ వెళ్లినట్లు తెలిపారు. కానీ పోలీసుల ఆకస్మిక తనిఖీలతో పోకర్ అక్కడ లీగల్ కాదని తెలుసుకున్నట్లు చెప్పాడు చీకోటి ప్రవీణ్.
అసలేం జరిగిందంటే..
థాయ్ లాండ్ లోని పట్టాయలోని ఓ హోటల్‌లో గ్యాంబ్లింగ్ ఆడుతున్న 83 మంది భారతీయుల్ని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది మహిళలు కూడా ఉన్నారు. అక్కడి మీడియా సంస్థ ద నేషన్ థాయ్ లాండ్ ఈ అరెస్టు వివరాలను ప్రకటించింది. మొత్తం 83 మంది హోటల్‌లో ఓ సెటప్ ఏర్పాటు చేసుకుని గ్యాంబ్లింగ్ ఆడుతున్న విషయంపై సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారని తెలిపింది. కొంత మంది పారిపోవడానికి ప్రయత్నించినా దొరికిపోయారని తెలిపింది. వీరికి సంబంధించిన ఫోటోలను కూడా ద నేషన్ థాయ్ లాండ్ పత్రిక ప్రచురించింది.
మెదక్ డీసీసీబీ చైర్మన్ సైతం!
ద నేషన్ థాయ్ లాండ్ పత్రిక రిలీజ్ చేసిన ఫొటోల్లో ఉన్న వారంతా తెలుగు రాష్ట్రానికి చెందిన వారే. గతంలో చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసుల్లో ఈడీ ప్రశ్నించిన వారే ఎక్కువగా ఉన్నారు. మాధవరెడ్డి అనే వ్యక్తితో పాటు మెదక్ డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి కూడా పోలీసులకు పట్టుబడిన ఫొటోల్లో ఉన్నట్లగా తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారి పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. అసలు నిర్వహకుడు చీకోటి ప్రవీణ్‌ను కూడా థాయ్ లాండ్ పోలీసులు పట్టుకున్నారని అంటున్నారు. నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ చిప్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.