Telangana News: తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ సమాజానికి గౌరవ ఉపాధి అవకాశాలు కల్పించడంలో చారిత్రాత్మక చర్యలు తీసుకుంటోంది. మహబూబాబాద్‌కు చెందిన శ్రావణి, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుల్లో ఉద్యోగం పొందారు. హైదరాబాద్‌కు చెందిన ప్రేం లీలా, జూట్ బ్యాగ్ మాన్యుఫాక్చరింగ్ వ్యాపారంలో రాణించి మార్పుకు ప్రతీకగా నిలుస్తున్నారు. సురారం ప్రాంతానికి చెందిన జాస్మిన్ స్వయంగా పిండి వంటల వ్యాపారాన్ని ప్రారంభించారు.




ట్రాఫిక్ అసిస్టెంట్‌గా శ్రావణి:
శ్రావణి, చిన్ననాటి నుంచి అనేక ఆటుపోట్లను ఎదుర్కొని, తెలంగాణ ప్రభుత్వంతో ట్రాఫిక్ అసిస్టెంట్‌గా పనిచేయడానికి అవకాశాన్ని పొందారు. "చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్లడం నాకు ఎంతో కష్టంగా అనిపించేది. తోటి పిల్లల మాటలు, పెద్దల అంగీకారం లేకపోవడం నా జీవన ప్రయాణంలో ప్రతీ అడుగునా ఇబ్బందికరంగా మారాయి," అని శ్రావణి చెప్పారు.




"ప్రారంభ దశలో నాకు సాధారణ ఉపాధి అవకాశాలు కూడా లభించలేదు. 'భిక్షాటనే మాకు జీవనోపాధి' అని, నేను నా పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటున్నాను. కానీ తెలంగాణ ప్రభుత్వం గౌరవంగా ఈ ఉద్యోగాన్ని ఇచ్చింది. 20 రోజుల శిక్షణ అనంతరం నేను ప్రస్తుతం చిలకలగూడా పరిధిలోని ఆలుగడ్డబావి సర్కిల్‌లో డ్యూటీ చేస్తున్నాను. మాకు అన్నివిధాలుగా చక్కటి ట్రానింగ్ ఇస్తున్నారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సార్, తెలంగాణ సీఎం రేవంత్ సార్‌కి హృదయపూర్వక ధన్యవాదాలు," అని శ్రావణి తెలిపారు.


ప్రేం లీలా: స్వయం ఉపాధికి ఆదర్శం
ప్రేం లీలా, 2021లో తెలంగాణ ప్రభుత్వ నిర్వహించిన స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా జూట్ బ్యాగ్ తయారీ శిక్షణ తీసుకుని, 'ప్రేం లీలా క్రియేషన్స్' అనే తన బ్రాండ్‌ను స్థాపించారు. ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్‌ల తయారీలో తనదైన గుర్తింపు పొందారు. "నా జీవితంలో నేను ఏదోకటి సాధిస్తాను అన్న నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోలేదు. మాకు అవకాశం వస్తే మార్పు తథ్యమని తెలుసు," అని ప్రేం లీలా తెలిపారు.




"ఇది కేవలం వ్యాపారం కోసం మాత్రమే కాదు; ట్రాన్స్‌కమ్యూనిటీ వారికి ఉద్యోగ అవకాశాలు కూడా మున్ముందు కలిపించడానికి నేను కృషి చేస్తున్నాను," అని ఆమె చెప్పారు. తెలంగాణ ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా త్వరలో శిల్పరామంలో పర్మనెంట్ స్టాల్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.


జాస్మిన్ పిండి వంటల వ్యాపార ప్రయాణం
"ఎన్నో సంవత్సరాలుగా మా ట్రాన్స్‌జెండర్స్‌కు ఉద్యోగ అవకాశాలు లేక ఆనేక కష్టాలు అనుభవించాము. సమాజంలో మమ్మల్ని ఛీ కొట్టిన వారే ఎక్కువ. ఇప్పుడు మేమంతా కలిసి మా సొంత వ్యాపారాలాను ప్రారంభించాం. చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్‌లో మాకు ఒక పర్మినెంట్ స్టాల్, ట్రాలీ స్టాండ్‌ను కేటాయించారు. నేను స్వయంగా తయారుచేసే తెలుగు పిండి వంటల స్నాక్స్‌తో ఒక వ్యాపారం నడుపుతున్నాను. 'జనమ్ తో జస్మిన్' అనే యూట్యూబ్ ఛానల్‌ను కూడా నిర్వహిస్తున్నాను. నా ఛానెల్‌లో ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారతపై కంటెంట్‌ను ప్రొడ్యూస్ చేస్తాను," అని జాస్మిన్ తెలిపారు.




"త్రిపుర సుందరీ, సహస్త్రా అనే ఇద్దరు ట్రాన్స్ మహిళలు కూడా ఇక్కడ జ్యూట్ బ్యాగ్స్ తయారు చేసి, తమ ఉత్పత్తులను స్టాల్‌లో ఉంచారు," అని జస్మిన్ పేర్కొన్నారు.


ఈ విధంగా, ట్రాన్స్‌జెండర్ వ్యక్తులకు గౌరవ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో వివక్షను తొలగించడమే కాకుండా, వారికి గౌరవంగా జీవించే అవకాశాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. "ప్రతి ఒక్కరికి గౌరవంతో జీవించే హక్కు ఉంది. ఇవి చిన్న అడుగులే అయినా, సమాజ మార్పుకు ఉదాహరణగా నిలుస్తాయి," అని శ్రావణి అభిప్రాయపడ్డారు.