Hyderabad News Latest: హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆఫీసుకు ఓ వ్యక్తి నాగుపామును తీసుకొని రావడంతో ఆయన ఆశ్చపోయారు. ఓ బాటిల్‌లో పాము పిల్లను తీసుకొని వచ్చి ఏకంగా ఎమ్మెల్యే టేబుల్‌పై పెట్టారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని అందుకే తాము ఏకంగా ఒక పామును పట్టుకొచ్చినట్లుగా బాధితులు తెలిపారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌కు ఈ అనుభవం ఎదురైంది.  


సికింద్రాబాద్ పరిధిలోని తుకారాంగేట్‌ పరిధి బోయబస్తీలో ఎక్కువగా గంగపుత్రులు నివాసం ఉంటారు. ఈ ప్రాంతంలో తరచూ పాములు సంచరిస్తున్నాయని స్థానికులు ఎన్నో ఫిర్యాదులు ఇచ్చారు. వాటి నియంత్రణ కోసం, మరోసారి రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికంగా నివాసం ఉండే బస్తీవాసులు ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ ను కోరారు. 


అంతేకాక, వారి బస్తీలో తిరుగుతున్న ఓ నాగుపాము పిల్లను పట్టుకుని ప్లాస్టిక్‌ బాటిల్‌లో వేసుకొని నేరుగా ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. సీతాఫల్‌మండిలోని సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్‌ ఆఫీసుకు నేరుగా వచ్చి ఆ బాటిల్ లో ఉన్న నాగుపామును బాటిల్‌తో సహా తీసుకొచ్చారు. బాటిల్‌లో ఉన్న పాము బుస కొట్టడం చూసి ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ తో పాటు ఎమ్మెల్యే సిబ్బంది అవాక్కయ్యారు. తమ బస్తీలో పాముల బెడద ఎక్కువగా ఉందని వాపోయారు. గతంలో ఓ బాలిక పాముకాటుతో చనిపోయిందని బస్తీ వాసులు ఎమ్మెల్యేకు వివరించారు.


తమ సమస్య గురించి ఎంత మందికి వివరించినా ఎవరూ పట్టించుకోలేదని.. చెప్తే విని వదిలేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారికి వీడియో కాల్‌ చేసి బాటిల్‌లో ఉన్న నాగుపామును ఫోన్లో చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బస్తీలో అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను, తుప్పలను తొలగించాలని ఆదేశించారు. చెత్త కుప్పలను, తుప్పలను, చెట్లను తీసేయాలని, పాములు రాకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.