Telangana CM Revanth REddy: తెలంగాణలో అధికారం మారినా కొందరి అధికారుల తీరుమాత్రం మారడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండానే సొంత నిర్ణయాలతో ప్రభుత్వానికి తలఒంపులు తెస్తున్నారు. మహబూబ్ నగర్ (Mahabubnagar)జిల్లాలో రైతుల సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లు తనిఖీ చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. ఎవరిని అడిగి తనిఖీలు చేశారని ఉన్నతాధికారులపై మండిపడ్డారు. ప్రజలు, రైతుల్లో భయాందోళనలు కలిగించేలా ఎందుకు వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన ఆదేశిచండంతో...డిస్కం డైరెక్టర్‌కు ఉద్వాసన పలికారు. ఎస్ఈపై బదిలీపై వేటు వేశారు.


రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
సచివాలయంలో ప్రజాప్రాలన దరఖాస్తులపై సీఎం రేవంత్ రెడ్డి( Telangana Cm Revanth Reddy) అధ్యక్షతన సమీక్ష జరుగుతుండగా...200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఏం చేయాలన్న దానిపై చర్చ జరిగింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహాల సంఖ్యపై తర్జనభర్జన పడుతుండగా సమావేశంలోనే ఉన్న ఉపముఖ్యమంత్రి, విద్యుత్తు శాఖ మంత్రి భట్టి విక్రమార్క( Batti Vikramarka)... మహబూబ్‌నగర్‌లో విద్యుత్‌శాఖ సిబ్బంది అత్యుత్సాహం గురించి తన దృష్టికి వచ్చిన విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు.


రైతుల కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేపట్టినట్లు తెలిపారు. దీనిపై మండిపడిన సీఎం రేవంత్‌రెడ్డి... రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరని నిలదీశారు. విద్యుత్ కనెక్షన్ల తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చిందని ఎవరంటూ అక్కడే ఉన్న ట్రాన్స్ కో సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా.. లేదా.. అని ఆరా తీశారు. ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు... ఇష్టానుసారం వ్యవహరిస్తే సహించేది లేదన్నారు.


సొంత నిర్ణయాలతో చేటు
శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్(ఆపరేషన్స్) జె.శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకున్న డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఐని నుంచి బదిలీ చేశామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని వెంటనే సంబంధిత మంత్రి మల్లు బట్టి విక్రమార్కకు వివరించామన్నారు. 
అప్పటికీ ఆగ్రహం చల్లారని రేవంత్‌రెడ్డి...ఇలాంటి చర్యలను భవిష్యత్‌లో సహించేది లేదన్నారు. ఎవరికి వారు తమకు తోచిన విధంగా వ్యవహరిస్తామంటే ఊరుకోబోమన్నారు. సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని అధికారులను హెచ్చరించారు. ఇదే తరహా ఘటనలు ఏ శాఖలో జరిగినా...ఈసారి ఉన్నతాధికారులపైనా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మెసేజ్ కిందిస్థాయిలో పనిచేస్తున్న అందరి ఉద్యోగులకు చేరాలన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టే ఎలాంటి పని చేసినా సహించేది లేదన్నారు..


బీఆర్‌ఎస్‌ విమర్శలు
విద్యుత్ ఉద్యోగులు రైతుల వ్యవసాయ కనెక్షన్ల సర్వే చేయడంపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌( BRS) నేతలు విమర్శలు చేసినట్లు తెలిసింది. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఉచిత విద్యుత్ ఎత్తివేస్తారని... వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తొలిగిస్తారని జోరుగా ప్రచారం చేశారు.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్( KCR) ప్రతి బహిరంగ సభలోనూ రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వ్యవసాయానికి 9 గంటలు విద్యుత్ దండగా అని రేవంత్‌ వ్యాఖ్యానించినట్లు పెద్దఎత్తున ప్రచారం చేశారు. అందుకు అనుగుణంగానే ఇప్పుడు విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారని గులాబీ నేతలు మళ్లీ విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి ఆగ్రహానికీ ఇదీ ఒక కారణమని తెలుస్తోంది.