Telangana Decade Celebrations on June 2nd: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో దశాబ్ది వేడుకలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఇప్పటికీ ఆహ్వానించారు. ఈ ఆహ్వానంపై సానుకూలంగా స్పందించిన ఆమె వేడుకలకు హాజరుకావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు  సోనియా గాంధీ కార్యాలయం నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయానికి సమాచారం వచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ధ్రువీకరించాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరుకావాలని ఇటీవల ఢిల్లీ వెళ్లి మరి సీఎం రేవంత్ రెడ్డి సోనియాగాంధీని ఆహ్వానించారు. జూన్ రెండో తేదీన తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఈ వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో.. హాజరుకావాలని సోనియాగాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే సోనియా గాంధీ పర్యటనకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్ రావాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


రేవంత్ రెడ్డి సమీక్ష


తెలంగాణ దశాబ్ది వేడుకలు నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమావేశాన్ని  గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో జయ జయహే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ కవి రచయిత అందెశ్రీ 20 ఏళ్ల కిందట రాసిన ఈ గీతాన్ని యథాతధంగా ఆమోదించినట్లు ఆయన ప్రకటించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి సంగీతంతోపాటు స్వరాలు కూర్చారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ఈ సమీక్షలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటి వెంకటరెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతోపాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతోపాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సిపిఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.


తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు ఆవిర్భావ దశాబ్ది ముగింపు వేడుకల నిర్వహణపైన చర్చించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని, అందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించిన సంక్షిప్త రూపం టీఎస్ ను టీజీగా మార్చినట్లు సీఎం తెలిపారు. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకే రాష్ట్ర గీతాన్ని ఆమోదించామని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించామని సీఎం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల కళాకారుల నుంచి దాదాపు 500 నమూనాలు తమకు అందినట్లు సీఎం తెలిపారు. వీటితోపాటు అనేక అంశాలపైన ఈ సమీక్షలో చర్చించారు.