Heavy Rains in Hyderabad:


హైదరాబాద్ సహా తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మంగళవారం (మే 7) సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకూ ఎండ కూడా విపరీతంగా కాయగా.. నిమిషాల వ్యవధిలోనే చీకట్లు కమ్ముకొని భీకర గాలులు వీచాయి. ఇంతలో భారీ వర్షం కూడా మొదలైంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ కాలంలో సాయంత్రం 5 గంటలకు సాధారణంగా ఎండ ఉండాల్సి ఉండగా నేడు మాత్రం వాతావరణంలో చిమ్మటి చీకటి అలుముకుంది. ఒక్కసారిగా వాతావరణం కూడా చల్లబడింది. భారీగా ఈదురుగాలులు వీచాయి. 


నిజాంపేట్, మాదాపూర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మూసాపేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ప్యారడైజ్‌, ప్యాట్నీ, ఎల్బీనగర్‌, బాలానగర్, ఫతేనగర్, సనత్ నగర్‌లోనూ వర్షం పడింది. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, మియాపూర్, చింతల్, షాపూర్, చందానగర్, గచ్చిబౌలి, ఎర్రగడ్డ, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, ముషీరాబాద్‌, చిక్కడపల్లిలోనూ వర్షం పడింది. అయితే, నగరమంతా ఒకేసారి కాకుండా కొంత సేపటి వ్యవధిలో వర్షం మొదలైంది. 


ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా చెట్లు, హోర్డింగ్స్‌ నేలకూలిపోయాయి. మరోవైపు, రోడ్లపై నీరు నిలిచిపోవడం వాహనాలు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. దీంతో అన్ని చోట్లా ట్రాఫిక్ కిలో మీటర్ల మేర నిలబడిపోయింది. డ్రైనేజీలు కూడా పొంగి ప్రవహించాయి.


ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్దపల్లి, మల్యాల, పెగడపల్లి, మానుకొండూర్‌, హుజూరాబాద్‌, వేములవాడలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, మంగపేట, ములుగు జిల్లాలోని ఏటూరునాగారం, తాడ్వాయి వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.


సీఎం కరీంనగర్ పర్యటన రద్దు
భారీ వర్షాల కారణంగా సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ నగర్ పర్యటన రద్దు అయింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం కోసం రేవంత్ రెడ్డి కరీంనగర్ కు వెళ్లాల్సి ఉంది. కానీ, రేవంత్‌ రెడ్డి పాల్గొనాల్సిన కాంగ్రెస్‌ జన జాతర సభ కోసం కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లు కూలిపోయాయి. ఈదురుగాలుల వల్ల కుర్చీలు కూడా చెల్లాచెదురు అయ్యాయి.


వర్ష ప్రభావం తక్కువగా ఉండడం వల్ల వరంగల్ ఈస్ట్, వరంగల్ వెస్ట్ రోడ్ షోలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన వరంగల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు.


ఇంకో 5 రోజులు వర్షాలు
తెలంగాణలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు ఆసిఫాబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, యాదాద్రి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.