BRS MLC Kavitha judicial custody extends | న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు పొడిగించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor Policy Case)లో మనీ లాండరింగ్ చట్టం కింద అరెస్టైన కవితకు మే 14వ తేదీ వరకు కస్టడీ పొడిగించింది కోర్టు. కవితకు విధించిన కస్టడీ ముగియడంతో తిహార్ జైలు నుంచి కవితను తరలించి కోర్టులో నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కస్టడీ పొడిగించాలని ఈడీ విజ్ఞప్తి చేయడంతో ఏకీభవించిన న్యాయమూర్తి కవిత కస్టడీ వారం రోజులు పొడిగించారు.
లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్లను దేశం దాటిస్తున్నారని, కానీ తనలాంటి వాళ్లను అరెస్ట్ చేయడం దారుణం అన్నారు కవిత. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించారు. మే 20 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. కాగా, ఈడీ అధికారులు మార్చి 15న హైదరాబాద్ కు వచ్చి విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం తెలిసిందే. అప్పటినంచి ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు.
కవిత కోరినట్లుగానే విచారణ
జ్యుడీషియల్ కస్టడీ ముగిసిన తరువాత కోర్టులో తనను నేరుగా విచారణకు హాజరుపర్చాలని కవిత ఇటీవల పిటిషన్ వేశారు. కానీ ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడటంపై ట్రయల్ కోర్టు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కవిత తదుపరి విచారణను ప్రత్యక్షంగా హాజరు పరచకుండా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. కానీ తనను నేటి విచారణకు మేజిస్ట్రేట్ ఎదుట నేరుగా హాజరు పరచాలన్న కవిత రిక్వెస్ట్ ను ఓకే చేసి తిహార్ జైలు నుంచి తరలించి కోర్టులో హాజరుపరిచారు. కవితకు మే 14తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది కోర్టు.