గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీగా సీవీ ఆనంద్‌ వచ్చాక పరిస్థితిలో చాలా మార్పులు వచ్చాయి. అప్పటి వరకు ఒక లెక్క అప్పటి నుంచి ఓ లెక్క అన్నట్టు యాక్షన్ షూరూ అయింది. 


హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చాలని సంకల్పించిన ఆనంద్.. స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఏ రూపంలో ఉన్న వాసన పసిగట్టి మరీ లోపలేస్తున్నారు. పోలీసులు కదలికలను పసిగట్టిన స్మగ్లర్లు వాళ్ల కంటే వేగంగా రూటు మారుస్తున్నారు. 


ఇన్నాళ్లు హైదరాబాద్‌లో యథేచ్చగా సాగిపోయిన గంజాయి వ్యాపారానికి ఇప్పుడు సమస్య వచ్చి పడింది. అందుకే కొత్త కొత్త మార్గాల్లో పోలీసుల ఎత్తులను చిత్తు చేసేందుకు విఫలయత్నం చేస్తున్నారు మాయగాళ్లు. సైబరాబాద్‌ సిటీ యువతను మత్తులో చిత్తు చేసేందుకు పోలీసుల కళ్లు గప్పి సరకు చేరవేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 


పోలీసుల కళ్లు గప్పి తప్పించుకోవడానికి గంజాయిని ఫౌడర్‌గా చేశారు. ఇప్పుడు ఏకంగా ఆయిల్‌గా మార్చేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా నూనె రూపంలో గంజాయి సరఫరాలకు యత్నించి బుక్కయ్యాడో స్మగ్లర్.


కొండాపూర్‌లో రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తిని చెక్‌ చేశారు. అతని వద్ద కొన్ని నూనె డబ్బాలు గుర్తించారు. ఏంటని ఆరా తీస్తే ఆయిల్ అని చెప్పాడు. తమ స్టైల్‌లో కూపీ లాగితే గంజాయి అని గుట్టుగా చెప్పాడు. 


విజయవాడకు చెందిన రాజా హర్షవర్థన్ అనే వ్యక్తి అరకు నుంచి గంజాయి తీసుకొచ్చి ఆయిల్ రూపంలోకి మార్చి విక్రయిస్తున్నాడు. కాలేజీ విద్యార్థులు, ప్రైవేటు ఉద్యోగులకు ఈ బాటిల్స్ అమ్ముతున్నాడు. ఒక్కో బాటిల్‌ స్టార్టింగ్ ప్రైస్‌ రెండు వేల రూపాయలు. డిమాండ్‌ను బట్టి ఈ రేట్‌ మారుతూ ఉంటుంది. 


 తనిఖీల్లో చిక్కిన రాజా హర్షవర్ధన్‌ నుంచి రెండు వందలకుపైగా ఆయిల్‌ బాక్స్‌లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అతన్ని ఇంకా విచారించి ముఠా గుట్టు రట్టు చేస్తామంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ జీవితాలు నాశనం చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. గంజాయిని ఏ రూపంలో రవాణా చేసినా, విక్రయించినా పట్టుకుంటామంటున్నారు పోలీసులు. 


 


గతంలో కూడా హైదరాబాద్‌ పోలీసులు హైదరాబాద్‌ ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న గంజాయిని రైల్వే స్టేషన్‌లో, బస్టాండ్స్‌లో పట్టుకున్నారు. అయినా స్మగ్లర్లు తమ పంథా మార్చుకోవడం లేదు. కొత్త మార్గాల్లో స్మగ్లింగ్‌కు యత్నిస్తున్నారు. ఇదే ఇప్పుడు పోలీసులకు సవాల్‌గా మారుతోంది. 






 


Also Read: భార్యను చంపబోతూ చెయ్యి కట్ చేసుకున్న భర్త.. దోషికి భారీ నష్ట పరిహారం ఇస్తూ కోర్టు తీర్పు!


Also Read: విజయనగరంలో ప్రేమికుల మధ్య గొడవ.. కట్ చేస్తే చెట్టుకు వేలాడిన యువతి, అంతుబట్టని మిస్టరీ!