ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. నేడు కేసీఆర్‌ స్వల్పంగా జ్వరంతో బాధపడుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ప్రధాని పర్యటనలో పాల్గొనలేకపోతున్నట్లుగా సీఎంవో వర్గాలు తెలిపాయి. నిజానికి ప్రధాని పర్యటనకు స్వాగతం పలికేందుకు తొలుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత సీఎం స్వయంగా ప్రధాని పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టింది మొదలు తిరిగి వెళ్లేవరకూ కేసీఆర్ పర్యటనలో పాల్గొంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు చివరి నిమిషంలో మోదీకి స్వాగతం పలికేందుకు కేసీఆర్ వెళ్లలేదు. ఆయన స్వల్ప అస్వస్థతతో ఉన్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.


నిజానికి ప్రోటోకాల్ ప్రకారం ఏదైనా రాష్ట్ర రాజధానిలో జరిగే ప్రధాని అధికారిక కార్యక్రమాలకు గవర్నర్‌, ముఖ్యమంత్రి, నగర మేయర్‌, సీఎస్‌, డీజీపీ తప్పకుండా హాజరై స్వాగతించాలి. అయితే, అనధికార కార్యక్రమాలు అయితే పాల్గొనాల్సిన అవసరం లేదు. విగ్రహావిష్కరణ అధికారిక కార్యక్రమం కాదని టీఆర్‌ఎస్‌ చెబుతోంది. మరి ఇక్రిషాట్‌లో జరిగిన కార్యక్రమం అధికారికమా అనాధికారికమా అని బీజేపీ ప్రశ్నిస్తోంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య విభేదాల కారణంగానే కేసీఆర్‌ ఉద్దేశపూర్వకంగానే ఈ పర్యటనలో పాల్గొనడం లేదని బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తోంది. దేశ ప్రధానికి జరిగిన అవమానంగా పేర్కొంటోంది.  







ఈ సందర్భంగా వరి ధాన్యం కొనుగోళ్ల అంశంపై స్పష్టత కోసం ఢిల్లీకి వెళ్లినప్పుడు కేసీఆర్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్‌ ఇవ్వకపోవడాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ మధ్య కేంద్ర బడ్జెట్‌ విషయంలో ప్రధాని మోదీపై కేసీఆర్‌ నిప్పులు చెరిగినందున ఆయన దూరంగా ఉంటున్నారని విశ్లేషిస్తున్నారు. 


ఆరేళ్ల క్రితం ఒకే వేదికపై ఇద్దరూ..
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ ఒకే వేదికపై కనిపించి దాదాపు 6 ఏళ్లు అవుతోంది. 2016లో గజ్వేల్‌లో మిషన్‌ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇద్దరూ పాల్గొన్నారు. రెండోసారి ఇద్దరూ అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో విమానం దిగిన మోదీ.. నేరుగా భారత్‌ బయోటెక్‌ పరిశ్రమకు వెళ్లి.. కోవిడ్‌ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో చర్చించారు. అటు నుంచే తిరిగి వెళ్లిపోయారు. అప్పట్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడం ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. గవర్నర్‌గానీ, సీఎంగానీ ఎవరూ ప్రధాని పర్యటనకు రావొద్దని పీఎంవో సమాచారం అందించింది. దాంతో అప్పుడు ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొనలేదు.