కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేసే క్రమంలో తన చేయి తానే కట్ చేసుకున్న ఓ వ్యక్తికి కోర్టు పరిహారాన్ని మంజూరు చేసింది. ఈ వింతైన ఘటన తర్వాత తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించి చేయి కోసుకున్న వ్యక్తికి కోర్టు పరిహారం మంజూరు చేసింది. ఈ ఘటన ఇంగ్లండ్‌లో చోటు చేసుకుంది. దీంతో తన భార్యను హత్య చేసేందుకు ప్రయత్నించి ప్రమాదవశాత్తూ తన చేతిలో కొంత భాగం కోల్పోయిన వ్యక్తికి 17,500 పౌండ్ల పరిహారం లభించింది. 


36 ఏళ్ల డోరినెల్ కొజాను అనే వ్యక్తి తన భార్యను 2015 డిసెంబర్‌లో హత్య చేసేందుకు యత్నించి 11 ఏళ్ల పాటు జైలులో ఉన్నాడు. తన మాజీ భార్య డేనియెల్లా (35)ను మద్యం మత్తులో ఉన్న కొజాను 8 అంగుళాల కత్తితో వెనుక, ముందు భాగంలో పొడిచాడు. ఆ క్రమంలో కత్తి ఆమె కుడి రొమ్ము గుండా వెళ్లి రెండు పక్కటెముకల గుండా వెళ్లి ఆమె ఊపిరితిత్తులు, కాలేయంలోకి వెళ్లడంతో తీవ్రంగా గాయపడింది. దాడి తర్వాత ఆమె దాదాపు నాలుగు నెలలు ఆసుపత్రిలో ఉంచి చికిత్స పొందాల్సి వచ్చింది.


అలా తన భార్యను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, కోజాను ఆమెను చాలా బలం ఉపయోగించి పొడిచాడు. ఆ క్రమంలోనే అతని కుడి చేతిపై రెండు వేళ్లు తెగిపోయాయి. దీనికి వెంటనే శస్త్రచికిత్స అవసరం పడింది. దీంతో కోజాను అప్పట్లోనే నష్ట పరిహారం దావా వేశాడు. జైలుకు రాకముందే పోలీసులు, వైద్యులు అతని చేతికి చికిత్స చేయడంలో విఫలమైనందున అతను తన కుడి చేతిని ఇన్నాళ్లూ వినియోగించలేకపోయానని పిటిషన్‌లో పేర్కొన్నాడు.


దీనికి సంబంధించిన విచారణ మే 2021లో, నార్విచ్ కౌంటీ కోర్టులో జరిగింది. న్యాయమూర్తి రికార్డర్ గిబ్బన్స్ అతనికి 8,500 పౌండ్ల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గాయం ఎలా జరిగిందనే దానిపై కోజాను అబద్ధం చెబుతున్నాడనే కారణంతో న్యాయమూర్తి గిబ్బన్స్ అతని వాదనలను చాలా వరకు తిరస్కరించాడు. అనంతరం కొజాను లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడి జడ్జి జస్టిస్ రిట్చీ అతని పరిహారాన్ని 17,500 పౌండ్లకి పెంచాలని తీర్పు ఇచ్చారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘‘సివిల్ చర్యలో విజయం సాధించడానికి పిటిషన్ దారుకు (కోజాను) ఎలా గాయం అయిందో నిరూపించాల్సిన అవసరం లేదు. జైలులో చేరడానికి ముందే అతను గాయపడ్డాడు. ఆ సమయంలో అతను దేనికీ దోషిగా నిర్ధారణ కాలేదు. అతను బీన్స్ డబ్బాను తెరిచే క్రమంలో గాయపడ్డాడా, గ్రూపు తగాదాల్లో గాయం జరిగిందా? లేదా అతని భార్యను హత్య చేయడానికి ప్రయత్నించినప్పుడు అతను గాయపడ్డాడా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఇందులో వైద్య పరమైన నిర్లక్ష్యం ఉంది.


కోజానుకు నష్ట పరిహారం ఇవ్వాలన్న హైకోర్టు నిర్ణయాన్ని అతని మాజీ భార్య అయిన డానియెల్లా తప్పుబట్టారు. ఆమె మండిపడింది: ‘‘ఇది ఎంతో అవమానకరమైనది, అసహ్యకరమైనది. అతను వ్యక్తి నన్ను చంపడానికి ప్రయత్నించిన హింసాత్మక భర్త. అతని వల్ల బాధితురాలినైన నేను ఏ పరిహారం పొందలేదు. అతను మాత్రం వేలకు వేలు రివార్డ్ పొందుతున్నాడు. నేను దాదాపు నాలుగు నెలలు ఆసుపత్రిలో ఉన్నాను. నాపై దాడి చేసే క్రమంలో తనకు తానుగా గాయపడినందుకు రివార్డ్‌ ఇవ్వడం అవమానకరం.’’ అని డానియెల్లా అభిప్రాయపడ్డారు.