ఏడాది క్రితం వారిద్దరికీ పరిచయం.. అదీ కాస్తా ప్రేమగా మారింది. దీంతో అప్పుడప్పుడు యువకుడి ఇంటికి యువతి తరచూ వస్తుండేది. ఇంతలో ఏమైందో ఏమో.. గత మూడు రోజుల క్రితం యువతి చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది.. ఏం జరిగింది..? ఇది ఆత్మహత్యా? హత్యా? విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడ గ్రామ సమీపంలో మండంగి సంధ్య అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తోటలోని చెట్టుకు ఉరివేసుకుని వేలాడుతున్న స్థితిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా సీతం పేట మండలం గొహిది గ్రామానికి చెందిన సంధ్య విజయనగరం జిల్లాలో చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం పోలీసులను చేరింది. కేసునమోదు చేసుకున్న ఎల్విన్ పేట పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం గొహిది గ్రామానికి చెందిన మండంగి సంధ్యకు సుమారు ఏడాది క్రితం గుమ్మలక్ష్మీపురం మండలం సందిగూడ గ్రామానికి చెందిన ఆరిక లక్ష్మణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో తరచూ యువతి సందిగూడలోని లక్ష్మణ్ ఇంటికి వస్తుండేది. ఈ దశలో గత నెలలో వీరిద్దరి మద్య గొడవ జరిగింది. దీంతో యువతి సంధ్య యువకుడి సర్టిఫికేట్లు తీసుకుని వెళ్లిపోయింది. అయితే, ఉద్యోగ వేటలో ఉన్న లక్ష్మణ్ తన వద్ద సర్టిఫికేట్లు లేకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. తన సర్టిఫికేట్లు ఇవ్వాలని, తాను పలు ఉద్యోగ పోస్టులకు దరఖాస్తు చేయాలని ఫోన్‌లో సంధ్యకు చెప్పాడు.


కాని యువకుడి అభ్యర్థనను సంధ్య పట్టించుకోక పోవడంతో చివరికి యువకుడు విషయాన్ని గొహిది సర్పంచ్ కు చెప్పి పంచాయితీ పెట్టించి మరీ తన సర్టిపికేట్లు తెప్పించుకున్నాడు. ఇక్కడితో సమస్య తీరిపోయిందని అంతా అనుకున్నారు. కాని గత నెల 28న సంధ్య మళ్లీ విజయనగరం జిల్లా సందిగూడ వచ్చింది. అయితే అప్పటికే యువకుడు లక్ష్మణ్ తన సొంత పని మీద విశాఖ జిల్లా వెళ్లాడు. మరి ఆ తరువాత ఏం జరిగింది అన్నది తేలాల్సి ఉంది. వీరిద్దరు కలుసుకున్నారా? లేదా అనేది పోలీసులు విచారణ జరుపుతున్నారు. గత నాలుగు రోజుల క్రితం మాత్రం సంధ్య సందిగూడ గ్రామానికి సుమారు అర కిలో మీటరు దూరంలోని తోటలో శవంగా కనిపించింది.


దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే విధంగా యువకుడు లక్ష్మణ్‌ను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మంచి భవిష్యత్ ఉన్న యువత లక్ష్యాలను పక్కన పెట్టి ఆకర్షణలకు లోనై ప్రాణాలు తీసుకోవడం.. భవిష్యత్ ను నాశనం చేసుకోవడం దారుణమని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.