రాహుల్ రామకృష్ణను ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. కమెడియన్‌గా నవ్వించే ఆయన, సీరియస్ రోల్స్ కూడా అంతే బాగా చేస్తారు. అవకాశాల పరంగా ఆయనకు లోటు లేదు. ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది రచయితలు, దర్శకులు పాత్రలు రాస్తున్నారు. ఇటువంటి సమయంలో అటు ఆడియ‌న్స్‌కు, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాహుల్ రామకృష్ణ షాక్ ఇచ్చారు. సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టు ట్వీట్ చేశారు.


"ఇకపై నేను సినిమాలు చేయను. 2022 (ఈ ఏడాదే) నా లాస్ట్ ఇయర్(సినిమాల్లో)" అని రాహుల్ రామకృష్ణ ట్వీట్ చేశారు. 'ఏంది బ్రో అంత మాటా అన్నావ్?' అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు. 'అన్నా... ఏమైంది?' అని ఇంకొకరు అడిగారు. ఈ ట్వీట్ నిజంగా రాహుల్ రామకృష్ణ వేశారా? లేదా... ఆయన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? అనేది ఇంకా తెలియలేదు. లేదంటే... నోరా ఫతేహి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిన సందర్భంగా బాలీవుడ్ మీడియా ఇచ్చిన వార్తపై సెటైర్ వేశారా? త్వరలో తెలుస్తుంది.


'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం', 'చిలసౌ', 'హుషారు' తదితర సినిమాల్లో రాహుల్ రామకృష్ణ నవ్వించారు. 'జాతిరత్నాలు' సినిమాలో ఆయన చేసిన కామెడీని ఎవరూ అంత త్వరగా మర్చిపోలేరు. 'భరత్ అనే నేను', 'రిపబ్లిక్' సినిమాల్లో రాహుల్ రామకృష్ణ చేసిన పాత్రలను కూడా ఎవరూ అంత త్వరగా మరువలేరు. సీరియస్ రోల్స్ కూడా తాను చేయగలనని ఆయన ప్రూవ్ చేసుకున్న చేసుకున్న క్యారెక్టర్లు అవి.