హైదరాబాద్‌లో సరిగ్గా 5 రోజుల క్రితం కనిపించకుండా పోయిన 5 ఏళ్ల బాలుడు ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. ఈ వ్యవహారం ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. బాలుడ్ని హైదరాబాద్ పోలీసులు క్షేమంగా ఢిల్లీ నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ ఈ వ్యవహారం ఎలా జరిగిందన్నది మాత్రం తేలడం లేదు. నగరంలోని మల్లేపల్లిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు ఇవీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల బాలుడు ఉన్నట్టుండి 5 రోజుల క్రితం అదృశ్యం అయ్యాడు. కంగారు పడిపోయిన తల్లిదండ్రులు అన్ని చోట్లా వెతుకుతుండగా ఉన్నట్టుండి ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యాడు. అక్కడి పోలీసులు ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్‌లోని హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హుటాహుటిన ఫ్లైట్‌లో ఢిల్లీకి వెళ్లి బాలుణ్ని క్షేమంగా ఇక్కడికి తీసుకొని వచ్చారు. స్టేషన్‌లోనే సాయంత్రం తల్లిదండ్రులకు బాలుడ్ని క్షేమంగా అప్పగించారు.
మల్లేపల్లిలోని బడీమసీదు ప్రాంతంలో ఉంటున్న కారు డ్రైవర్ హనీఫ్ కుమారుడు ఆయాన్ ఈనెల 17న కనిపించకుండా పోయాడు. పోలీసులు నగరంలోని 3 కమిషనరేట్ల పరిధిల్లో గాలిస్తున్నారు. అదే సమయంలో బాలుడి వివరాలు ట్విటర్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా వాటిని చూసిన ఢిల్లీ నిజాముద్దీన్ పోలీసులు ఆదివారం నగర పోలీసులను సంప్రదించారు.
ఈ క్రమంలో బాలుడు ఆయాన్‌ను తీసుకు వచ్చేందుకు అడిషనల్ ఇన్‌స్పెక్టర్ నరసింహ, బాలుడి తండ్రి హనీఫ్‌లు ఆదివారం ఢిల్లీకి వెళ్లారు. నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాలుణ్ని తీసుకుని హైదరాబాద్‌కు సోమవారం వచ్చారు. ఈ నెల 19న ఒక అపరిచిత వ్యక్తి నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్‌కు వచ్చి తన ఆధార్ వివరాలు నమోదు చేసి ఆయాన్‌ను అప్పగించి వెళ్లాడంటూ నిజాముద్దీన్ పోలీసులు చెప్పారు. అయితే, మల్లేపల్లిలో ఉన్న బాలుణ్ని ఆ వ్యక్తే చేరదీసి రైల్లో ఢిల్లీకి తీసుకెళ్లాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. కిడ్నాప్ చేసిన వ్యక్తి రైల్లో ఎందుకు తీసుకెళ్లాడు? ఎందుకు ఢిల్లీ పోలీసులకు అప్పజెప్పాడనేది మాత్రం అంతుచిక్కడం లేదు. కిడ్నాప్ చేసుంటే ఆధార్ కార్డు, వివరాలు పోలీసులకు ఎందుకు ఇచ్చాడని ఆరా తీస్తున్నారు. అయితే, కిడ్నాప్ చేసిన వ్యక్తి ఢిల్లీలో వదిలేయగా.. మరో వ్యక్తి చేరదీసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.