సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అనుచరులతో కలిసి సుబ్బారావు విధ్వంసానికి స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వహకుడైన ఆవుల సుబ్బారావు సహా అతని అనుచరులు శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులు ఈ అల్లర్లకు సహాయపడ్డారు. నరేష్ అనే వ్యక్తి ఆందోళన కారులకు భోజనాలు అందేలా చూసుకున్నాడు. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొల్పేలా వాట్సప్ గ్రూపుల్లో ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. జూన్ 16నే సుబ్బారావు హైదరాబాద్‌కు చేరుకొని, తన అనుచరులతో మంతనాలు జరిపాడు. విధ్వంసానికి హోటల్ నుంచి కూడా ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు.


సాయి డిఫెన్స్ అకాడమీకి ఆర్‌పీఎఫ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రైల్వే యాక్ట్ 1989 కింద పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న ఆర్‌పీఎఫ్ కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయి డిఫెన్స్ అకాడమీ చెందిన రికార్డులు ఆధారాల పత్రాలతో కార్యాలయానికి హాజరుకావాలని సూచించారు.


సాయి డిఫెన్స్ అకాడమీకి చెందిన 12 సెంటర్లతో పాటు మరో 6 డిఫెన్స్ అకాడమీలతో కూడా ఆవుల సుబ్బారావు మాట్లాడారని పోలీసులు గుర్తించారు. అయితే ఈ ఆరు డిఫెన్స్ అకాడమీలపై కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. విధ్వంసం జరిగిన రోజు రాత్రి 9 గంటల వరకు ఆవుల సుబ్బారావు హైదరాబాద్ బోడుప్పల్ లోని తన డిఫెన్స్ అకాడమీలోనే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో సుబ్బారావు కారులో గుంటూరుకు వెళ్లిపోయినట్టుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారని పోలీసులు గుర్తించారు.


Also Read: Khammam: ఖమ్మంలోకి అడుగుపెట్టిన పాడు కల్చర్‌! ఆ గలీజు అలవాట్లకు బానిసవుతున్న యువత?


ఈ కేసులో ఇప్పటివరకు 63 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. ఇప్పటికే 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి ఆచూకీ కోసం  వెతుకుతున్నామని, వారి కోసం ప్రత్యేక టీమ్ లు పని చేస్తున్నాయని పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ విధ్వంసానికి సంబంధించి సేకరించిన ప్రాథమిక ఆధారాలు, అరెస్టయిన నిందితుల నుంచి రికార్డు చేసిన వాంగ్మూలాలను పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు.


Also Read: AP Cabinet Decisions : అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చేందుకు ఏపీ కేబినెట్ ఆమోదం, కీలక నిర్ణయాలు ఇవే