Secunderabad Cantonment Board: సికింద్రాబాద్ పరిధిలోని తిరుమలగిరి, బోయిన్ పల్లి ప్రాంతాల్లో ఇక ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. ప్రస్తుతం ఉన్న రోడ్లను విస్తరించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వానికి భూములు ఇచ్చేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్ హెచ్ 44 ప్యారడైజ్ - సుచిత్ర, ఎస్హెచ్1 జింఖానా గ్రౌండ్ - హకీంపేట్ వరకు రోడ్డు విస్తరణకు 33 ఎకరాల భూమిని ఇచ్చే తీర్మానాన్ని ఆమోదించినట్లు బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వెల్లడించారు.


ఆర్మీ, ప్రైవేటు, బీ2 కలిపి మొత్తం 124 ఎకరాల కేటాయింపు విషయం ఆయా శాఖలు చూస్తాయని సీఈఓ వెల్లడించారు. స్కైవేలు, మెట్రో కారిడార్, రహదారుల విస్తరణ కోసం రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని గత కొన్నేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు బోర్డు సీఈఓ తెలిపారు. 33 ఎకరాల రాష్ట్ర ప్రభుత్వం రూ.329 కోట్లను ఇస్తే కంటోన్మెంట్ పరిధిలో ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కంటోన్మెంట్ బోర్డు ఇచ్చిన భూముల్లో రోడ్డు విస్తరణ ద్వారా బోయిన్ పల్లి, తిరుమలగిరి మార్గాల్లో ట్రాఫిక్ తగ్గనుంది.