తెలంగాణలో దానిమ్మ పండు ధరలు బాగా తగ్గిపోయాయి. ఈ పండ్ల సరఫరా పెద్ద ఎత్తున జరగడం వల్లే ధరలు దిగి వచ్చినట్లుగా తెలుస్తోంది. పక్షం రోజుల వరకు కూడా ఒక్కో దానిమ్మ రేటు సగటున రూ.30 ఉండగా, తాజాగా దాని రేటు సగానికి తగ్గి రూ.15కు పడిపోయింది. ఇక నాణ్యత తక్కువగా లేదా చిన్నగా ఉన్న దానిమ్మలను కొన్నిచోట్ల రూ.5కే అమ్ముడుపోతూ ఉంది.


దానిమ్మ ఉత్పత్తి ఎక్కువగా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ఉంటుంది. కర్ణాటకలో కోలార్, చిక్కబళ్లాపూర్, బెంగళూరు గ్రామీణ, బెలగావి, బాగల్ కోట్ తదితర ప్రాంతాల్లో దానిమ్మ పంటలు బాగా పండుతాయి. మహారాష్ట్రలోని సోలాపూర్, సాంగ్లీ, జల్నా, ఔరంగాబాద్, పుణె, వాషి, అహ్మద్ నగర్ తదితర ప్రాంతాల్లో కూడా దానిమ్మ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ప్రాంతాల్లోని రైతులు దానిమ్మ పండ్లను హైదరాబాద్ కు ఎగుమతి చేస్తారు. అవి హైదరాబాద్ లోని బాటసింగారం మార్కెట్ కు వస్తాయి.


అయితే, ఈ రెండు రాష్ట్రాల్లో దానిమ్మ పంటలు బాగా పండటం వల్లే సరఫరా బాగా జరుగుతూ ఉందని, అందుకే ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వచ్చే కొద్ది రోజుల్లో మరింతగా దానిమ్మ ధరలు పడిపోతాయని వారు చెబుతున్నారు. సాధారణంగా జులై నాటికి పంట చేతికి వస్తే అదే సమయంలో దానిమ్మ పండ్లు మార్కెట్ కు వస్తాయి. ఆగస్టు మొదటి వారం నుంచి దానిమ్మ పండ్ల సరఫరా బాగా పెరుగుతుంది. తాజాగా సరఫరా మరింత ఎక్కువ కావడం వల్ల మరో మూడు నెలల దాకా అంటే డిసెంబర్ దాకా దానిమ్మ పండ్ల ధరలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.