Hyderabad News: సంక్రాంతి పండుగకు పతంగులు ఎగిరేయడంపై నిషేధం విధించినట్లుగా వస్తున్న వార్తలపై అధికారులు స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తం అని హైదారాబాద్ పోలీసులు ఏబీపీ దేశంతో చెప్పారు. జ‌న‌వ‌రి 14వ తేదీ ఉద‌యం 6 గంట‌ల నుంచి 16వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు గాలి పటాలు వేగిరేయడంపై పోలీసులు నిషేధం విధించారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. పంతంగుల ఎగిరేయడంపై నిషేధం లేదని ఏబీపీ దేశంతో స్పష్టం చేశారు. ఎప్పటిలాగానే సంక్రాంతి పండుగ రోజు పతంగులు ఎగరేసుకునే స్వేచ్ఛ నగర వాసులకు ఉందని చెప్పారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌ను దృష్టిలో ఉంచుకొని, ప్ర‌ధాన కూడ‌ళ్లు, ప్రార్థ‌నా స్థ‌లాలు, చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో ప‌తంగుల‌ను ఎగుర‌ వేయ‌డం సరికాదని చెప్పారు.   


జాగ్రత్తలు తీసుకుంటూ మాత్రమే పతంగులు ఎగుర వేయాలి.. 


గాలి పటాలు ఎగరేసేందుకు వాడే మాంజాతో చాలా ప్రమాదమని హెచ్చరించారు. మాంజా చిక్కుకుపోయి గొంతు తెగి పక్షులే కాకుండా మనుషుల చనిపోయిన సందర్భాలను పోలీసులు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటనలో మళ్లీ జరగకుండా ఉండడానికి ప్రధాన రహదారులు, రద్దీ ఉన్న ప్రాంతాల్లో పతంగులు ఎగుర వేయడం నిషేధించినట్టుగా అధికారులు స్పష్టం చేశారు. మాంజా కోసం రోడ్డుమీద పరిగెత్తుకుంటూ, బంగ్లాలపై చూసుకోకుండా ఎటుపడితే అటు నడవకూడదని సూచించారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూనే పతంగులు ఎగుర వేసుకోవాలని వివరించారు. సౌండ్ పొల్యూషన్ యాక్టు 2000 రూల్ 8 ప్రకారం సంబంధిత పోలీసు అధికారుల నుంచి అనుమతి లేకుండా, బహిరంగ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, డీజేలను పెట్టరాదని తెలిపారు.


ట్రాన్స్ ఫార్మర్లు, స్తంభాల్లో చిక్కుకున్న పతంగులు తీయొద్దు..


బ‌హిరంగ ప్ర‌దేశాల్లో విపరీతంగా శబ్దాలు చేస్తూ డీజేలు పెట్టేందుకు అనుమతి లేదని పేర్కొన్నారు. పగటి పూట 65 డెసిబుల్స్, రాత్రి స‌మ‌యాల్లో 55 డెసిబుల్స్, నివాస ప్రాంతాల్లో 55 డెసిబుల్స్‌కు సౌండ్ తీవ్ర‌త పెర‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. రాత్రి 10 నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు ఎలాంటి లౌడ్ స్పీక‌ర్లు ఉప‌యోగించ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. బాల్క‌నీల్లోకి పిల్ల‌ల‌ను అనుమ‌తించ‌కూడ‌దని తెలిపారు. తల్లిదండ్రులే తగ జాగ్రత్తలు తీసుకోవాలని.. ఎప్పుడూ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు. గోడ‌ల‌పై నిల్చుని ప‌తంగులు ఎగుర‌ వేయొద్ద‌ని వివరించారు. గాలిపటాల కోసం ముందూ వెనక చూడకుండా తమ పిల్లలు రోడ్లపై పరుగులు తీయకుండా చూడాలని తల్లిదండ్రులను కోరారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మ‌ర్ల వ‌ద్ద చిక్కుకుపోయిన గాలిప‌టాల‌ను సేక‌రించే ప్ర‌య‌త్నం చేస్తే, కరెంట్ షాక్ కొడుతుందనే విషయంపై పిల్లలకు అవగాహన కల్పించాలి అని సీపీ తెలిపారు. పండుగ ప్రతీ ఒక్కరిలో సంతోషం, ఆనందాన్న నింపాలి కానీ విషాదాన్ని నింపకూడదని.. అందుకోసమే మనమే జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు. వీలైనంత వరకు మాంజాలు ఉపయోగించకుండా సాధారణ దారాలు ఉపయోగించడం మేలని చెప్పారు. వీటి వల్ల మనుషులతో పాటు పక్షులకు కూడా ఎలాంటి ప్రమాదం వాటిల్లదని పేర్కొన్నారు.